ఎండొస్తేనే గొంతు తడిచేది!?

ఎండొస్తేనే గొంతు తడిచేది!?
  • సూర్యుడు కోసం పడి గాపులు!

కేసముద్రం, ముద్ర: ఎండాకాలం వస్తే అనేక ఆవాస ప్రాంతాల్లో తాగునీటికి తిప్పలు పడడం సహజం. అయితే అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం సబ్ స్టేషన్ తండా గ్రామ ప్రజలు తాగునీటి తిప్పలు తీర్చడానికి నిత్యం సూర్య భగవానుడి దర్శనం కోసం ఎదురుచూడాల్సిన విభిన్న పరిస్థితి. గ్రామంలో 300 కుటుంబాలు నివసిస్తుండగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకంలో నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు ఆ నల్లల ద్వారా నీరు సరఫరా చేస్తున్నప్పటికీ ఆ నీళ్లను తాగడానికి వినియోగించడం లేదు. కేవలం దైనందిన కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తూ, తాగునీటికి పూర్తిగా తండా వాసులంతా సోలార్ పంపుసెట్టుపై ఆధారపడి జీవిస్తున్నారు.

సబ్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటుచేసిన సోలార్ పంప్ సెట్టు నీళ్లు స్వచ్ఛతగా ఉంటాయని, అలాగే ఆ నీళ్లు తాగడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు కలగవని నమ్ముతున్నారు. రెండు రోజులుగా వాతావరణం మేఘావృతమై సూర్యుడు కనిపించకపోవడంతో సోలార్ పంప్ సెట్ పనిచేయడం మానేసింది. దీనితో తాగునీటి కోసం తండావాసులంతా అక్కడకు తిరిగి సూర్య భగవానుడి రాక కోసం నిరీక్షిస్తుండగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కాస్త వాతావరణం తెరిపిచ్చి సోలార్ పంప్ సెట్ కొంతసేపు పనిచేయగా తాగునీటి కోసం ఒక్కసారిగా ప్రజలు అక్కడికి చేరడంతో సందడిగా మారింది.