మోదీ ప్రియమైన ప్రధాని కాదు..! చాలా పిరమైన ప్రధాని..!!

మోదీ ప్రియమైన ప్రధాని కాదు..! చాలా పిరమైన ప్రధాని..!!
  •  దేశాన్ని దోచి స్నేహితునికి పెడుతున్నాడు..
  • చెప్పుకోవడానికి కేంద్రం చేసిన ఒక్కపని ఉందా..!!
  • ఎర్రబెల్లి దయాకర్ రావు.. దేశంలోనే ఉత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి..
  • వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లను మించిన మెజారిటీ పాలకుర్తిలో రావాలి..
  • తొర్రూరు బహిరంగసభలో మంత్రి కేటీఆర్..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రియమైన ప్రధానమంత్రి కాదని.. చాలా పిరమైన ప్రధానమంత్రి అని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ..సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకవెళ్తున్నారని, నరేంద్ర మోడీ మాత్రం వీలైనంతగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నాడని ఆరోపించారు.

అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు రూపాయలు వేస్తానని ప్రధాని మోడీచెప్పారని, ఒక్కరి ఖాతాలోనైనా 15 లక్షల రూపాయలు పడ్డాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతి రైతు కుటుంబానికి రైతుబంధును అందజేస్తున్నారని, రైతు బంధు అందరికీ అందుతుందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం తన స్నేహితుని కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నారని, దేశ సంపదను తన మిత్రుని ఖాతాలో జమ చేస్తున్నారని అన్నారు. మీ..ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలోనే ఉత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని, దేశంలో ఎక్కడ ఉత్తమపంచాయతీలను ప్రకటించిన తెలంగాణరాష్ట్రానికి అధికంగా బహుమతులు వస్తున్నాయన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పట్ల మంత్రి దయాకర్ రావుకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని.., ఎంత అభివృద్ధి చేసినా.. ఇంకా ఏదో కావాలని అడుగుతూనే ఉంటాడన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇచ్చారని, దయాకర్ రావు ఇంకా నిధులు కావాలంటున్నారని, తొర్రూరు మున్సిపాలిటీకి మరో 25కోట్ల రూపాయలు మంజూరు చేస్తానన్నారు. తొర్రూరులో 100పడకల ఆసుపత్రి, పాలకుర్తిలో 50పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మంజూరు ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి దయాకర్ రావుకు మద్దత్తుగా పాలకుర్తి ప్రజలు ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నా..సిరిసిల్ల కన్నా పాలకుర్తిలో ఎక్కువ మెజారిటీ చూపించి మీరు సిపాయిలని నిరూపించుకోవాలన్నారు. మంత్రి దయాకర్ రావు అద్యక్షతన జరిగిన ఈ..బహిరంగసభలో మంత్రి సత్యవతిరాథోడ్, యంపిలు మాలోత్ కవిత, దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు,శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్,ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.