బీహార్ కార్మికుల్లేక పోతే మిల్లుల నిర్వాహణ కష్టమే!?

బీహార్ కార్మికుల్లేక పోతే మిల్లుల నిర్వాహణ కష్టమే!?

పెరుగుతున్న స్థానికేతర కార్మికుల సంఖ్య

కేసముద్రం, ముద్ర: స్థానికంగా కార్మికుల సంఖ్య రోజురోజుకు తరిగిపోతుండగా, స్థానికేతర కార్మికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పుడు బిహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బిహార్ కార్మికులు పని మానుకుంటే, మిల్లులు నడిచే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. కేసముద్రం మండలంలో 2-6 టన్నుల సామర్థ్యం కలిగిన రైస్ మిల్లులు 30 వరకు ఉండగా, అందులో దాదాపు 300కు పైగా బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. స్థానిక కూలి, హమాలీ కార్మికులు మార్కెట్, ట్రేడింగ్ కంపెనీలు, కొన్ని మిల్లులకే పరిమితం కాగా, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులే ఎక్కువగా విధులు నిర్వహిస్తున్నారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుండడంతోపాటు, పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉంటుండడంతో మిల్లు యజమానులు బీహార్ కార్మికులతో పనులు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పార్ బాయిల్డ్, రా రైస్, జిన్నింగ్ మిల్లుల్లో బీహార్ కార్మికుల కోసం యజమానులు ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయడం గమనార్హం. స్థానిక కూలి హమాలీ కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాటు కొందరికి వ్యవసాయ ఉండటం, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తుండడంతో, సీజన్లో పరిశ్రమల్లో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీనితో గత ఐదేళ్ల నుంచి బీహార్ నుంచి కార్మికులను ఇక్కడికి రప్పించుకోవడం జరుగుతోంది. బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఎండనక, వాననక, రాత్రనకా, పగలనకా పనికి ప్రాధాన్యం ఇస్తుండడంతో మిల్లర్లు బిహారీలకే పెద్ద పీట వేస్తున్నారు. స్థానికంగా కూలీ, హమాలీలకు ఇచ్చే చార్జీలతోనే ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగుతుండడంతో కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో బీహారి కార్మికుల సంఖ్య రోజుకు పెరుగుతోంది.