ఆర్యవైశ్యుల సేవాతత్పరత అభినందనీయం..

ఆర్యవైశ్యుల సేవాతత్పరత అభినందనీయం..
Minister Errabelli Dayakar Rao
  • తొర్రూరులో వాసవిభవన్ నిర్మాణానికి రూ.40లక్షలు.. 
  • వాసవిక్లబ్,వాసవీ వనితా క్లబ్ నూతన కార్యవర్గం  ప్రమాణ స్వీకారానికి  హాజరైన రాష్ట్ర  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • వాసవి క్లబ్ నూతన అధ్యక్షుడిగా వజినేపల్లీ అనిల్, వాసవీ వనితా క్లబ్ అధ్యక్షురాలిగా వజినేపల్లి దీప 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: ఆర్యవైశ్యులు కేవలం సంపాదన, వ్యాపారమే లక్ష్యంగా కాకుండా సేవా తత్పరతతో పనిచేసే గొప్ప లక్షణం ఉన్న సామాజిక వర్గం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆదివారం జరిగిన వాసవీక్లబ్, వాసవీ వనితక్లబ్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో ధనిక వర్గంగా ఉన్న ఆర్యవైశ్యులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజంలో తమకంటూ ఒక మంచి గుర్తింపుని పొందారని చెప్పారు. తనకు ఆర్యవైశ్య సామాజిక వర్గంతో 40 ఏళ్లుగా అనుబంధం ఉందని వాళ్ళ అనుబంధంతో తాను ఇంత గొప్ప స్థాయికి ఎదిగానని చెప్పారు. కచ్చి తత్వానికి, నమ్మకానికి, ప్రేమకు, సేవకు మారుపేరుగా ఎదిగారని మంత్రి తెలిపారు. అయితే ఆర్యవైశ్యులలో నిరుపేదలు ఉన్నారని ఆ నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఆర్యవైశ్యుల్లో పేదలు ఉన్నప్పటికీ వాళ్ళు తమ పేదరికాన్ని ఏనాడు ప్రదర్శించరని, ఉన్నదాంట్లో ఎదుగుతూ, పదిమందికి సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే గొప్పతత్వమున్న వారు ఆర్యవైశ్యులని మంత్రి తెలిపారు.

ఆర్యవైశ్యులకి అనుబంధంగా పనిచేస్తున్న వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ ల సేవలు మరువలేనివని మంత్రి అన్నారు. హైదరాబాదులో మొదట ఉద్భవించిన ఈ రెండుక్లబ్బులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తమై దేశవ్యాప్తమై ప్రపంచానికి కూడా విస్తరించాయని మంత్రి అన్నారు. ఆర్యవైశ్యులు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా చేరి తమ సామాజిక వర్గంలోని నిరుపేదలను ఆదుకోవడమే కాక సమాజంలోని ఇతర పేదలను కూడా ఆదుకునే విధంగా చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఇప్పటికే చేస్తున్న సేవలకు మించి తమ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య వైద్యరంగం తో పాటు నిరుపేదలకు పెళ్లిళ్లు చేయడం చదువుకునే వాళ్ళకి ఉన్నత ఇతర చదువులకు అవకాశం కల్పించడం, సాయం చేయడం, నిరుపేదలకు ఇల్లు కట్టించేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని... ఈ దిశగా ఆర్యవైశ్య సంఘాలు వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ ఆలోచించాలని మంత్రి సూచించారు. తొర్రూరు వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ లకు నా చిరకాల మిత్రులు వజినేపల్లి అనిల్ వజినేపల్లి దీపలు ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు. 

తొర్రూరు వాసవీ భవన్ కు రూ.40 లక్షలు..
ఈ రెండు క్లబ్బులకు తను  సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి తెలిపారు. తొర్రూరు పట్టణంలో వాసవి భవన్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. అన్ని హంగులతో మంచి భవనాన్ని నిర్మింపచేస్తామన్నారు. ఈ వాసవి భవన కేంద్రంగా విశిష్ట సేవలు అందించాలని చెప్పారు. జిల్లా ఇన్ చార్జి ప్రొద్దుటూరి గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొర్రూరు వాసవి క్లబ్ అధ్యక్షుడిగా వదినేపల్లి అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా చిగురాల నవీన్ కుమార్ కోశాధికారిగా మహేష్ లు పదవీ ప్రమాణం చేశారు. అలాగే వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలిగా వదినేపల్లి దీప, ప్రధాన కార్యదర్శిగా చీదర నీలిమ, కోశాధికారిగా చిదిరాల గీత లు పదవీ ప్రమాణం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ ,పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, వివిధ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.