గుట్టలుగా పేరుకుపోతున్న దరఖాస్తులు! సర్టిఫికెట్ల కోసం ప్రజల పడి గాపులు

గుట్టలుగా పేరుకుపోతున్న దరఖాస్తులు! సర్టిఫికెట్ల కోసం ప్రజల పడి గాపులు

కేసముద్రం, ముద్ర: చేతివృత్తుల వారికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ పథకం కోసం దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువుండగా, కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం ప్రజలు దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహాసిల్దార్ కార్యాలయంలో ఆయా దృవీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు గుట్టలుగా పేరుకు పోతున్నాయి. సర్టిఫికెట్ల జారీ కోసం సిబ్బంది కుస్తి పడుతున్నప్పటికీ సర్వర్ మొరాయిస్తుండడంతో సర్టిఫికెట్లు జారీ చేయడానికి తీవ్ర ఆటంకంగా మారింది. దీనితో ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహాసిల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. సుమారు రెండు వేలకు పైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.

తరచుగా సర్వర్ డౌన్ అవుతుండడంతో ఎర్రర్ మెసేజ్ వస్తు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోతోందని వాపోతున్నారు. దీనితో తాము లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతామేమోనన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సందట్లో సడే మియా అన్న చందంగా కొందరు సర్టిఫికెట్ల జారీకి చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చేయి తడిపితే సర్టిఫికెట్ చేతిలో పడుతోందని, లేదంటే దరఖాస్తులను పక్కన పడేస్తున్నారని ఎంసీపీఐ (యు) మండల కార్యదర్శి సలీం తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అక్రమాలు లేకుండా, దరఖాస్తు ప్రక్రియ ఆధారంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తహాసిల్దార్ సాంబశివుడు చెప్పారు.