తొలి సారి దక్కిన రైతు బంధు!

తొలి సారి దక్కిన రైతు బంధు!

నారాయణపురం రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు బీమా పథకానికి ఇంతకాలం నోచుకోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు తొలిసారిగా రైతుబంధు సాయాన్ని అందుకున్నారు. ఆ గ్రామ భూముల రికార్డులు ధరణి పోర్టల్ లో నమోదు చేయకపోవడంతో చాలాకాలంగా రైతుబంధు, రైతు బీమా పథకాలకు దూరం కావాల్సి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం ఆ గ్రామంలో అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సర్వే చేయించి 354 మంది రైతులకు 738 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. వారంతా ఇటీవల 11వ విడత రైతుబంధు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఎకరానికి 5000 రూపాయల చొప్పున దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసింది.

ఈ నేపథ్యంలో తొలిసారిగా నారాయణపురం గ్రామ రైతులకు రైతుబంధు సాయం దక్కడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు తమకు రైతుబంధు రైతు బీమా పథకాలు అమలు కావడంతో పాటు ధరణి ద్వారా కొత్తగా పట్టా పాట్ పుస్తకాలు లభించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో 1,200 ఎకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు జారీ కావలసి ఉందని రైతులు చెబుతున్నారు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకొని తమ గ్రామ రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి రైతుబంధు రైతు బీమా పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు.


నెరవేరిన కల: రైతు వెంకట్ రెడ్డి
ఏళ్ల తరబడిగా తమ తాత ముత్తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూములను ధరణిలో చేర్చకపోవడంతో ఇంతకాలం రైతుబంధు సాయాన్ని అందుకోలేకపోయామని, ఐదేళ్లకు పైగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి పట్టా పాస్ పుస్తకాల కోసం రైతుబంధు రైతు బీమా పథకాల కోసం నిరీక్షించగా ఎట్టకేలకు తమ కల నెరవేరిందని నారాయణపురం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు ఆనందం వ్యక్తం చేశాడు. అయితే తనకు ఆరు ఎకరాల భూమి ఉండగా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే పట్టా పాస్ పుస్తకం జారీ చేసి రైతుబంధు ఇచ్చారని మిగిలిన మూడు ఎకరాల భూమికి కూడా ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.