నిరంతర ప్రక్రియ ప్రకటనతో నిమ్మలమైంది!

నిరంతర ప్రక్రియ ప్రకటనతో నిమ్మలమైంది!
  • ప్రశాంతంగా మారిన తహాసిల్ ఆఫీసులు

కేసముద్రం, ముద్ర: చేతి వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పధకం కోసం ఈనెల 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ తొలుత ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తుదారులు కచ్చితంగా ఇటీవల మీసేవ ద్వారా పొందిన ఆదాయతృవీకరణ పత్రంతోపాటు కుల దృవీకరణ పత్రాన్ని జతచేయాలని సూచించడంతో దరఖాస్తుదారులంతా పోలోమంటూ వందలాదిగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి, తహాసిల్ కార్యాలయం నుంచి సర్టిఫికెట్లను పొందడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. వందలాది దరఖాస్తులు ఒక్కసారిగా రావడంతో మీసేవ వెబ్సైట్ పై ఒత్తిడి పెరిగి తరచూ మొరాయించడం జరిగింది. ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ కోసం అప్లోడ్ చేసిన వెంటనే సర్టిఫికెట్ జారీ కాకుండా ఎర్రర్ వస్తుండడంతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ గందరగోలంగా మారింది. దీనితో వందలాదిమంది మీసేవ కేంద్రాలకు, తహాసిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడి గాపులు పడాల్సి వచ్చింది. అనేక చోట్ల సర్టిఫికెట్ల జారీ కోసం  దొడ్డిదారిలో డబ్బులు దండుకోవడం, వాటాల కోసం పలుచోట్ల రెవెన్యూ సిబ్బంది పరస్పరం గొడవలకు దిగడం, జనమంతా సర్టిఫికెట్ల కోసం మూకుమ్మడిగా కార్యాలయాలను దిగ్భందించడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో శనివారం మంత్రివర్గ ఉప సంఘం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చేతి వృత్తి దారుల ఆర్థిక సహాయం కోసం విధించిన గడువును ఎత్తివేస్తూ, ఇది నిరంతర ప్రక్రియగా ప్రకటించారు. ప్రతి నెల 15న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో రెవెన్యూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అబ్బ పెద్ద లొల్లి తప్పింది, వారం రోజుల నుంచి తిండి తినలేదు, కంటి నిండ నిద్ర లేదని, ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు పాణం నిమ్మలమైందని రెవెన్యూ సిబ్బంది వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా జనంతో కిటకిటలాడిన తహసిల్ కార్యాలయాలు ఇప్పుడు సందడి లేక ప్రశాంతంగా మారిపోయాయి.