ముగిసిన బాలాజీ టాకీస్ చరిత్ర

ముగిసిన బాలాజీ టాకీస్ చరిత్ర

కాలగర్భంలో 50 ఏళ్ల గుర్తు

కేసముద్రం, ముద్ర: అర్థ శతాబ్దం పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన చరిత్ర కలిగిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బాలాజీ టాకీస్ శనివారం కాలగర్భంలో కలిసిపోయింది. 1973లో పావలా, అర్ధ, ముప్పావలతో నేల, బెంచి కుర్చీ టిక్కెట్లతో ప్రారంభమైన సినిమా హాలు 40 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచింది. ఆ తర్వాత క్రమక్రమంగా మారుతున్న కాలంతో పోటీ పడలేక మూతపడింది.

ఈ నేపథ్యంలో సినిమా హాలు యజమానులు కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే యోజనలో భాగంగా బాలాజీ టాకీస్ ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. ఆ మేరకు శనివారం యంత్రాలతో సినిమా హాలు పూర్తిగా కూల్చివేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆనాటి రోజులను గుర్తు చేసుకొని అయ్యో బాలాజీ టాకీస్ ఇక కనుమరుగయ్యిందా అంటూ నిట్టూర్పు విడిచారు.