మాతా శిశు కేంద్రంలో శిశువు అనుమానాస్పద మృతి

మాతా శిశు కేంద్రంలో శిశువు అనుమానాస్పద మృతి
  • విరిగిన చేయి, తల వీపుపై తీవ్ర గాయాలు
  • వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమా ?
  • న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాబు మృతి అనుమానాస్పదంగా మారింది. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ శ్వేత డెలివరీ నిమిత్తం సోమవారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయింది.  ఈరోజు ఉదయం నొప్పులు తీవ్రం కావడం వైద్యులు పరీక్షించి డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీ చేసే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన శిశువుకు కుడి చేయి విరిగిందని, తల, వీపు  కమిలిపోయి ఉందని, మెడ చుట్టూ గాయాలయ్యాయని బంధువులు ఆరోపిస్తున్నారు. డెలివరీ అనంతరం పరీక్షించిన వైద్యులు బాబుకు శ్వాసకు సంబంధించి ఇబ్బంది ఉందని ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ అమర్చారు. ఈరోజు ఉదయం శిశువుకు సీరియస్ గా ఉందని మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పటల్ కు షిఫ్ట్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో బాబును పరీక్షించగా అప్పటికే విగతజీవిగా మారాడు. దీంతో శ్వేత భర్త, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన చేపట్టారు. విరిగిన చేయి, బాబు వంటిపై ఉన్న గాయాలకు గల కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.