వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
  • గిట్టుబాటు ధర, కనీస సౌకర్యాలు కల్పించాలి
  • మిల్లర్ల దోపిడి అరికట్టాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 353 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2 మాత్రమే ప్రారంభించి, ప్రచార ఆర్భాటం చేసి చేతులు దులుపుకున్నారే తప్ప గింజ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం నుండే వరి కోతలు మొదలయ్యాయని, వడ్లను ఎక్కడ నిల్వ చేసుకోవాలో రైతులు అయోమయంలో ఉన్నారని వెల్లడించారు. దీన్ని ఆసరాగా చేసుకొని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని అన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ జిల్లా వాసిగా ఉండి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి కొనుగోలు సెంటర్ల వద్ద టెంట్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, గత సీజన్లో రైతులు పడ్డ ఇబ్బందులను గుర్తించి మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తగినన్ని గన్ని సంచులు, సుతిల్ అందుబాటులో ఉంచాలని అన్నారు. 

అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతుల అకౌంట్లోనే నేరుగా డబ్బులు పడేవిధంగా తగు చర్యలు చేపట్టాలని అన్నారు.
గత సీజన్లో రైస్ మిల్లర్లు తరుగు, మట్టి పేరుతో ఒక సంచికి 4 కిలోల నుండి 6 కిలోల వరకు ఎక్కువ తూకం వేశారని మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. గతంలో హమాలి ఖర్చులు ప్రభుత్వమే భరించేదని ఇప్పుడు క్వింటాలకు 40 నుండి 42 రూపాయలు హమాలి ఖర్చులు రైతులు చెల్లించవలసి రావడం బాధాకరం అన్నారు. దీని మూలంగా రైతులపై అధిక భారం పడుతుందని అన్నారు. 
గతంలో మాదిరిగానే హమాలి ఖర్చులు ప్రభుత్వం భరించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
 లేదంటే రైతుల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సూపరిండెంట్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, నరేష్ పటేల్, ఎం.పూజ, నాయకులు జి తిరుపతి, కోనేటి నాగమణి, గజ్జల శ్రీకాంత్, కొంపెల్లి సాగర్,  అరవింద్, రోహిత్, వినోద్ సాయి, శివ సురేష్ , మనోజ్, సందేశ్ తదితరులు పాల్గొన్నారు.