మీకు మాటిచ్చా... అలాగే వచ్చా!

  • తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల

 Aravind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ కోసం జైలు ఎదుటకు ఆప్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే ర్యాలీగా ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు. కారు పైనుంచి ప్రసంగించిన అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బయటికి వచ్చిన కేజ్రీవాల్.. జూన్ 1 వ తేదీ వరకు బయట ఉండనున్నారు.

జైలు శిక్ష పడిన  50 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌కు  సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత  కొన్ని గంటల్లోనే ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. కేజ్రీవాల్ భార్య సునీత, ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన నివాసానికి భారీ ర్యాలీతో కేజ్రీవాల్ తరలి వెళ్లారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అభిమానులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. జైలు నుంచి త్వరలోనే బయటికి వస్తా అని మాటిచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం బయటికి వచ్చి మీ ముందు నిలిచానని తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని, దాని కోసం తాను సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.