నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం..

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం..
  • అభ్యర్థులు మార్గదర్షకాలు పాటించకపోతే చర్యలు తప్పవు
  • మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని, నామినేషన్లకు సంబంధించిన అన్ని విషయాల్లో పోటీ చేసే అభ్యర్థులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల సంఘం సూచనలు తప్పకుండా పాటించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుందని   తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న  నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని  తెలిపారు. ఈ నెల 30 న పోలింగ్, డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. నామినేషన్లను ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల  నుండి మధ్యాన్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాలలోని  రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల కమిషన్  కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని విడుదల చేసిందన్నారు. అభ్యర్థులు నామినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్ర త్తలను అందులో వివరంగా తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలియచేస్తూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదించే వ్యక్తులు లేనట్లయితే వారి నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్నారు. దీంతో పాటు అభ్యర్థికి  ప్రతిపాదించే వ్యక్తు లకు అభ్యర్థి పోటీ చేస్తున్న శాసనసభ నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా  సూచించారు.ఈ సందర్భంగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు...

నామినేషన్ల దాఖలు సందర్భంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణ సమయం ప్రతి రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాలి.
+  నామినేషన్ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీకి చెందిన వారయినట్లయితే ఆ అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపో తుంది. అలాగే గుర్తింపు పొందని పార్టీ నుంచి కానీ,  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేట్లయితే అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందన్నారు.
శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి పేరుతో మాత్రమేఖాతా ఉండాలి. అలాగే ఎన్నికల్లో ఖర్చు చేసే ప్రతి రూపాయి ఒక ఖాతా (అకౌంట్) నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి పరిస్థి తుల్లో జాయింట్ అకౌంట్ తెరవడానికి అవకాశంలేదు. అభ్యర్థి ఒక్కరి పేరుతో మాత్రమే ఖాతా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కల్పించిన శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తన ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా  అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో  ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్ వేయడానికి కనీసం 24 గంటల ముందు ప్రారంభించిన నూతన బ్యాంకు ఖాతా నంబర్ను సమర్పించాలి. అలాగే  బ్యాంకు పేరు, బ్రాంచి చిరునామా తదితర వివరాలు స్పష్టంగా అందులో తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా వర్గాలకు చెందిన వారై ఉండాలి అందుకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ప్రజాప్రాతినిథ్య చట్టం-– 1951లోని సెక్షన్ 4, 5 ప్రకారం జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది.  శాసనసభ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులు  రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.  అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయినట్లయితే  రూ.5 వేలు సెక్యూ రిటీ డిపాజిట్ చెల్లించాలి.నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలూ తప్పకుండా పొందుపర్చాలి. నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధ్రువపత్రాన్నయినా  సమర్పించలేని పక్షంలో వాటిని అందించేందుకు తుది గడువు వరకు సమయం ఉంటుంది.

నామినేషన్లు సమర్పించే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలోపు ఊరేగింపులకు అనుమతి ఉండదు. అలాగే 100 మీటర్ల దూరంలోకి 3 వాహనా లను మాత్రమే అనుమతిస్తారు.రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు  నలుగురు  మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది.నామినేషన్ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొచ్చు. అలాగే న్యాయవాదిని కూడా తీసుకెళ్ళేందుకు అనుమతి ఉంటుంది.  అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే, అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి  నేర చరిత్రను తప్పకుండా తెలియచేయాల్సి ఉంటుంది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఏదైనా పార్టీ వారి బీ–ఫారం అందచేస్తే ఆ పార్టీ అభ్యర్థిగా, లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి ఉన్నట్లు పరిగణిస్తారు.  అభ్యర్థి సమర్పించే అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వంటి నేరచరిత్ర మొత్తాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. నేరచరిత్రను ఆయా పార్టీలతోపాటు పోటీలోని అభ్యర్థులు పత్రికల్లో ప్రకటించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులయినట్లయితే  వ్యక్తిగతంగా నేర చరిత్రను ప్రక టించాలి. అదే అఫిడవిట్ను జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. దీనిలో వివరాలు సక్రమంగా లేనట్లయితే ఎవరైనా సదరు అభ్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది.  నామినేషన్లకు సంబంధించిన ఫారం–-26 లోని ప్రతి గడిని సరైన సమా ధానంతో పూరించాల్సి ఉంటుంది. అందులో అడిగిన వివరాలు వర్తించకపోతే.. 'నాట్ అప్లికబుల్' అని తెలపాలి. అలా కాకుండా ఖాళీగా ఉంచినట్లయితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు.