ఇక రాజకీయం చూపిస్తా..!

ఇక రాజకీయం చూపిస్తా..!
  • సీఎంగా రోజుకు 18 గంటలు పని చేశా.. ఇకపై పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తా
  • వంద రోజుల పాలనలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు
  • కేసీఆర్​ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేసే పనిలో ఉన్నా
  • కేంద్రం, గవర్నర్​, రాజ్యం వ్యవస్థలతో ఘర్షణ పడబోం
  • రెండొందల ఉచిత విద్యుత్​ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు
  • నిజాంలాగే రాచరికాన్ని తేవాలని చూసిన కేసీఆర్‌ కు ప్రజలు బుద్ది చెప్పారు
  • ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని కేసీఆర్‌,  ప్రజల స్వేచ్చను గౌరవించలేదు
  • ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం
  • ఈటెలకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై  కేంద్రంతో విచారణ చేయించాలి
  • ఆర్​ఎస్​ ప్రవీణ్​ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేస్తే వద్దన్నారు
  • వంద రోజుల కాంగ్రెస్​ పాలన అన్ని వర్గాలను సంతృప్తిపర్చింది
  • మీట్​ ది ప్రెస్​ లో సీఎం రేవంత్​ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఎన్నికల కోడ్​ రాకముందు వరకు సీఎంగా నిబద్ధతతో రోజుకు 18 గంటలు పని చేసిన తాను ఇకపై పార్టీ అధ్యక్షుడిగా పని మొదలుపెడతానని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన వంద రోజుల పాలనలో తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదనీ, ఈరోజే గేట్లు ఎత్తానని చెబుతూ ఆయన ఇక రాజకీయం ఏంటో చూపిస్తానని బీఆర్​ఎస్​ నేతలను పరోక్షంగా హెచ్చరించారు. ఆదివారం బషీర్​ బాగ్​ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా వ్యవహరించగా, టీ యూడబ్ల్యూ జే ప్రధాన కార్యదర్శి తొలుత స్వాగతం పలికారు. పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా వేదికపై ఆసీనులయ్యారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం మూడు నెలల తర్వాత, లోక్​ సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండదంటూ కేసీఆర్​, కడియం శ్రీహరి, బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. వంద రోజుల పాలనలో అన్ని వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తోన్న తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎంగా వందో రోజు ఓ గేటును తెరిచానన్న సీఎం, అవతల వర్గం ఖాళీ అయిన తర్వాత గేట్లు మూసినా తెరిచినా ఒక్కటేనన్నారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామన్న సీఎం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఇన్నాళ్లు కవులు కళాకారులను తన గడీలో బంధించిన కేసీఆర్​ దొరగారి భుజకీర్తులను సాగించాలంటూ తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారని ఆరోపించారు. ఉద్యమంలో చేసిన వాగ్దానాలను విస్మరించిన కేసీఆర్​.. అధికారంలోకి రాగానే తెలంగాణ సంస్కృతిని చెరిపేప్రయత్నం చేశారన్నారని దుయ్యబట్టారు.

అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ సూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిందన్నారు. ధర్నా చౌక్​ వద్దన్న వారికి కూడా అక్కడ ధర్నాకు అవకాశం కల్పించిన ఘనత తమప్రభుత్వానిదే అన్నారు. ప్రగతిభవన్​ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామనీ, ఇప్పుడు తనతో పాటు మంత్రులందరూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో మాదిరిగా కాకుండా సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చామన్నారు. ఉద్యమంలో చేసిన వాగ్దానాలను విస్మరించిన కేసీఆర్​.. అధికారంలోకి రాగానే తెలంగాణ సంస్కృతిని చెరిఏ ప్రయత్నం చేశారన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చి.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశామన్నారు. తాము పాలకులం కాదు, సేవకులం అని నిరూపించుకునేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు.

కేసీఆర్​ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నా..!

కేసీఆర్​ నాటిన గంజాయి మొక్కల వాసన ఇంకా వెదజల్లుతోందని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కలుపు మొక్కలను ఒక్కొక్కటిగా పీకిపారేస్తున్నామన్న సీఎం.. ఇంకా చాలా మంది భరతం పట్టాల్సి ఉందని పరోక్షంగా హెచ్చరించారు. కేసీఆర్ నాటిన కలుపుమొక్కలన్నీంటినీ త్వరలోనే ఏరిపారేస్తామన్నారు. పేదలకు రెండొందల యూనిట్ల జీరో బిల్లును అమలు చేస్తుంటే కొంత మంది తెలివితేటలు ఉపయోగించి ఆ పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​ రావును ఉద్దేశించి చెప్పారు. హరీష్ ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదని సీఎం సెటైర్లు వేశారు. నువ్వు కూడా ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండవని హరీశ్​ రావు ను హెచ్చరించారు. జీరో బిల్లు పథకంపై..తెలంగాణ ఎలక్ట్రిసీటీ రెగ్యులేటర్​ కమిషన్​ నుంచి ప్రభుత్వానికి నోటీసు అందిందనీ అందులో ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ ముందుగా సంస్థలకు ఇచ్చిన తర్వాతే జీరో బిల్లులు ఇవ్వాలని కమిషన్​ స్పష్టం చేసిందన్నారు. అయితే  గత ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్​ ఇస్తుంటే ఏనాడైనా ఇలాంటి  ఆదేశం ఇచ్చారా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పేదలకు ఉచిత కరెంట్​ ఇస్తుంటే.. ఫాం హౌజ్​ లో ఉండి కను సైగలు చేస్తే కొంత మంది అతితెలువు ప్రదర్శిస్తూ ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.  ఈ విషయంలో ఎవరు అడ్డుపడ్డా.. అడ్డం తొలిగించుకుని.. అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించైనా పేదలకు జీరో బిల్లు పథకాన్నిఅమలు చేస్తామని స్పష్టం చేశారు.  రైతు భరోసా కు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు ఐదెకరాలలోపు ఉన్న దాదాపు 62లక్షల మందికి రైతు బంధు వారి ఖాతాల్లో జమా చేశామన్నారు. గుట్టలకు, రోడ్లలో పోయిన భూములకు, చెట్లకు, లేఅవుట్లయి బంగ్లాలు కట్టిన వాటికి ఇవ్వబడవు. వాటికి సంబంధించి సర్వే నిర్వహించి తొలిగిస్తామన్నారు. అందుకే రైతుబంధు కావాలంటోన్న వారిని దరఖాస్తు చేసుకోమని చెప్పామన్నారు. 

నిజాంలాగే వ్యవహరించిన కేసీఆర్​..!

నిజాం నవాబులాగే కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో రాచరికాన్ని తేవాలని చూశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారసులను సీఎంను చేయాలని అనుకున్నారని వ్యాఖ్యానించారు. తన వారసత్వాన్ని రాష్ట్ర ప్రజల తలలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందన్న రేవంత్ వాటికి వ్యతిరేకంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పు ఇచ్చారన్నారు. 1948 సెప్టెంబర్‌ 17కు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యతే  3 డిసెంబర్‌ 2023కు ఉందన్నారు. ఏడు తరాలు ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం.. నిజాం సాగర్​ కట్టినా, నిజాం కాలేజీ నిర్మించినా, నిజాం ఆర్థోపెడిక్​ హాస్పిటల్​ ఇచ్చినా, ఉస్మానియా యూనివర్పిటీ, హాస్పిటల్స్​ కట్టించినా, ఈ ప్రాంత ప్రజలకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నేనే ఇచ్చానని చెప్పి ప్రజలను బానిసలుగా ఉండాలని, వెట్టిచాకిరీ చేయాలి, ఎనిమిదో తరం కూడా ఈ ప్రాంతాన్ని పాలించాలి ఏడో నిజాం నవాబు కోరుకున్నాడన్నారు. అభివృద్ధి నమూనాలు చూపించి రాష్ట్రంలో రాచరికం చెలాయించాలని కేసీఅర్ చూశారన్నారు. కానీ ప్రజలు మాత్రం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరిని ఒప్పుకోమని వ్యతిరేకించి.. ఏమిచ్చినా స్వేచ్చను గుంజుకుంటే ఊరుకోమని చెప్పి సాయుధ రైతాంగం పోరాట నిర్మాణాన్ని నిర్మించి తిరుగుబావుటా ఎగురవేశారన్నారు. 4వేల మంది రైతులు నేలకొరిగా వారి రక్తాన్ని ధారపోసి.. నిజాం నిరంకుశత్వం నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించారన్నారు. దాదాపు పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్​ కూడా సంక్షేమం, అభివృద్ధి పేరిట నిరంకుశ పాలనకు తెరలేపారని దీంతో ఆయన కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారని వివరించారు. నిజాం నకలునే కేసీఆర్‌ చూపించారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్న సీఎం.. ఆయన ఏనాడు ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదని మండిపడ్డారు.

కేంద్రం, గవర్నర్​, రాజ్యంగ వ్యవస్థలతో ఘర్ణణ పడబోం..!

తాను కేంద్రం,గవర్నర్ ఇతర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.వంద రోజుల తమ పాలనతో ఈ విషయాన్ని స్పష్టం చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్ల ఉంటే..ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్యపూర్వక విధానాలతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నట్లు సీఎం వివరించారు. అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తామన్నారు. వైబ్రాంట్ తెలంగాణనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్‌ అందుతున్నాయనీ,42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం లబ్దిపొందారన్నారు.

ఈటల..ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రంతో విచారణ చేయించు..!

బీఆర్​ఎస్​ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్​ పాలనలోనూ సీఎం రేవంత్​ రెడ్డి ఫోన్​ ట్యాపింగ్​ చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్​ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ఈటెలకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రంతో విచారణ చేయించాలని సవాలు విసిరారు. ఇటు బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పార్టీ రాజీనామాపై స్పందించిన సీఎం..ఆర్​ఎస్​ ప్రవీణ్ అంటే తనకు ఇప్పటికీ  గౌరవం ఉందన్నారు. ఆయన ఉద్యోగంలో ఉంటే ప్రస్తుతం డీజీపీ అయ్యేవారన్నారు. అయితే తాను కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి తీసుకోవాలని ప్రవీణ్ కు ఆఫర్ చేశానన్న సీఎం..దానికి ఆయన ఒప్పుకోలేదన్నారు. భవిష్యత్తులో ఆయన కేసీఆర్ తో జతకలుస్తారని తాను భావించడం లేదనీ, ఒకవేళ కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే అన్నారు. సీఎంచీఫ్​ పీఆర్వో అయోధ్య రెడ్డి, ఇండియన్​ జర్నలిస్ట్​ యూనియన్​ (ఐ జేయూ) కార్యదర్శి వై.నరేందర్​ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి కె రవి కాంత్ రెడ్డి,  జవహర్ లాల్ నెహ్రూ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బి కిరణ్ కుమార్, కార్యదర్శి వంశీ శ్రీనివాస్, టీ యూ డబ్ల్యూ జే ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, హెచ్ యూజే అధ్యక్షుడు ఎస్ శంకర్ గౌడ్, చిన్న పత్రికలు, మ్యాగజైన్ ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, కార్యదర్శి బాలకృష్ణ, తెలంగాణ ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి కే ఎన్ హరి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.