చరిత్ర మీద చెట్లు మొలుస్తున్నాయి

చరిత్ర మీద చెట్లు మొలుస్తున్నాయి
  • పురాతన ఆలయాలు కనుమరుగవుతున్నాయి 
  • నదీ తీర గ్రామాలు కాలగర్భంలో కలుస్తున్నాయి 
  • ఎటు చూసినా విగ్రహాలే అయినా ఎవరికి పట్టదు 
  • 'తొగుట గ్రామం పై ముద్ర ప్రత్యేక కథనం'

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: చరిత్ర మీద చెట్లు మొలుస్తున్నాయి.. ఆలన,పాలన లేక పురాతన ఆలయాలు కనుమరుగవుతున్నాయి... నదీతీరంలోని ఊరి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి...
ఒకప్పుడు నిత్య పూజలు అందుకొని గొప్పగా వెలుగొందిన ఆలయాల్లోని దేవతా విగ్రహాలు ఇప్పుడు నిర్లక్ష్యం పాలయ్యాయి. విలువైన విగ్రహాలు ఎన్నో దొంగల పాలయ్యాయి.. గతం ఎంతో ఘన కీర్తి గడించిన తొగుట గ్రామంపై ముద్ర ప్రత్యేక కథనం.. సిద్దిపేట జిల్లాలోని మండల కేంద్రమైన తొగుట చరిత్రను ఒకసారి పరిశీలిస్తే గతమెంతో ఘన కీర్తి ఇప్పుడేమో నిరాదరణ గురవుతున్న ఊరిగా మిగిలిపోయింది. ఈ గ్రామము పూర్వపు మెదక్ జిల్లాలోని కొండపాక మండలం తొగుట గ్రామంగా ఒక వెలుగు వెలిగింది. దీనికి సర్పంచిగా మాజీ మంత్రి, దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డి అనేక ఏళ్లపాటు సర్పంచిగా ప్రాతినిధ్యం వహించాడు. దొమ్మాట ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో తొగుటను మండల కేంద్రంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి సాధించాడు.ఈ గ్రామము ఒకప్పుడు చారిత్రకమైన కూడ వెళ్లి నది ఒడ్డున ఉండేది.వరదల వల్ల కాలక్రమేనా సమీప ప్రాంతానికి మారింది. గ్రామంలోని రామాలయం కాకతీయ రాజుల కాలం నుంచి ఉంది. ప్రస్తుతము ఆ ఆలయము నిరాదరణ పాలయింది. ఆలయం పై చెట్లు మొలిసాయి.

గర్భగుడిలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు నాగులమ్మ కుంట వద్ద పురాతన దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. కుంట సమీపంలో నిరాధారం గురైన విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. కుంట వద్ద నాగులమ్మ దేవత విగ్రహం సమీపములో గ్రామ మధ్యన ఇసుకలో కూలిపోయిన భూలక్ష్మి దేవత విగ్రహము ఉన్నాయి. ఇవి ఆలనాపాలన లేక నిర్లక్ష్యం పాలయ్యాయి. గ్రామ నడిబొడ్డున మంకాల మల్లయ్య ఇంటి వద్ద గణపతి విగ్రహము రోడ్డు పక్కన పడి ఉంది. మరోచోట రోడ్డు మధ్యలోనే ఆంజనేయస్వామి విగ్రహము నిలిచి ఉంది. ఇంకోచోట అమ్మవారి విగ్రహము ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. ఇక గ్రామ సమీపంలోని పొలాల్లో గూడవల్లి నది ఒడ్డున అనేక దేవతా విగ్రహాలు పాలనా పాలన లేక ఎండ కు ఎండుతూ వానకు తడుస్తూ పొలాల్లోనే పడి ఉన్నాయి ని పట్టించుకునే నాధుడే లేడు.ఇక వ్యవసాయ పొలంలో వేప చెట్టుకింద వీరభద్ర స్వామి విగ్రహము నిలబడి ఉంది. గ్రామానికి చెందిన మంగలి బాలయ్య పొలంలో దున్నుతుండగా చాలాచోట్ల ఆలయాల ఆనవాళ్లు భూమి కనిపించాయి. దీంతో వీరభద్రుని వేప చెట్టు కింద నిలబెట్టి పంటలు సాగు చేసుకుంటున్నాడు. ఇంకోవైపు ఇదే పొలాన్ని సమీపంలో భూసవాల్ల పొలాల్లో భూదేవి మాత, సరస్వతి మాత విగ్రహాలు బయల్పడ్డాయి. వారు కూడా వాటిని పొలం గట్టును పెట్టి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.

మరోవైపు వడ్డెరవాళ్ళ గుడిసెల వద్ద నందీశ్వరుని విగ్రహం పడి ఉంది ఇది గ్రామ రామాలయం నుంచి ఎత్తుకెళ్లి నా విగ్రహంగా గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 1000 గా ఉన్న దుర్గమ్మ ఆలయము శిధిలమై పోయింది.ఇలా ఊరి చుట్టూరా ఎన్నో దేవతా విగ్రహాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నప్పటికీ అటు దేవాదాయశాఖ అధికారులు గానీ,ఇటు జిల్లా యంత్రాంగం గాని వాటిని ఒకచోటికి చేర్చడం లేదా ఆలయాలు నిర్మించి అందులో పున ప్రతిష్టించడం చేయకపోవడం వల్ల విగ్రహాలన్నీ అలాగే మిగిలిపోయాయి. రామాలయ చరిత్ర ఎంతో ఘన కీర్తి సాధించిందని ఈ ఆలయంలో దేవత విగ్రహాలు దొంగల పాలయ్యాయని గ్రామానికి చెందిన 95 సంవత్సరాల కురువృద్ధుడు రాపాక రాములు ముదిరాజ్ 'ముద్ర ప్రతినిధి'తో తెలిపారు. రామాలయం వద్ద మాఘమా అమావాస్యకు ఇప్పటికినీ గ్రామస్తులు విగ్రహాలు లేని గుడికి పూజలు చేయాల్సి చేస్తున్నారని తెలిపారు. మరోవైపు మల్లన్న సాగర్ డ్యాం నిర్మాణం ఈ గ్రామం మీది భాగంలోనే ఇటీవల ప్రభుత్వం చేపట్టింది. డ్యాము నిర్మాణం పూర్తి కావడంతో పర్యాటకుల సంఖ్య మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొగుటలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తే బాగుంటుందని గ్రామ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక ప్రాంతంగా మారుతున్న తొగుట తొగుటకు ఆలయాలను పునర్నిర్మించి ఆధ్యాత్మిక గ్రామంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.