కేసీఆర్‌‌ కుటిల నీతికి.. ఓటుతో గుణపాఠం చెప్పారు

కేసీఆర్‌‌ కుటిల నీతికి.. ఓటుతో గుణపాఠం చెప్పారు
  • గ్రామీణ, గిరిజన బిడ్డలంతా కాంగ్రెస్‌ వెంటే ఉన్నారు
  • ఆరు గ్యారెంటీలతో అందరికీ అభివృద్ధి ఫలాలు
  • టీపీసీసీ మెంబర్‌‌ డాక్టర్‌‌ లక్ష్మీనారాయణ నాయక్​

ముద్ర ప్రతినిధి, జనగామ : మాయమాటలతో రెండు సార్ల అధికారాన్ని చేజిక్కించుకుని రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించిన కేసీఆర్‌‌ కుటిల నీతిని ప్రజలు గుర్తించారని, అందుకే ఈసారి ఓటుతో తగిన గుణపాఠం చెప్పారని టీపీసీసీ మెంబర్‌‌ డాక్టర్‌‌ లక్ష్మీనారాయణ నాయక్‌ విర్శించారు. బుధవారం ఆయన జనగామలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల పోరాటం, బలిదానాలు చూసి చలించి కాంగ్రెస్‌ అధినేత్రి 2014లో తెలంగాణ ఇచ్చిందన్నారు. అలా వచ్చిన తెలంగాణలో మాయమాటలతో గద్దెనెక్కిన కేసీఆర్‌‌ 9 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నాడనే తప్ప చేసిందేమీలేదన్నారు. ఇక కేసీఆర్‌‌ అవినీతి, అరాచక పాలనపై తమ నేత టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సమరశంఖం పూరించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అన్నీ తానై పార్టీ ముందుకు నడిపించి రాష్ట్రంలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గెలిపించడంలో కీలకంగా పనిచేశారన్నారు. ఆయనకు అధిష్టానం సీఎం పదవిని అందించి సముచిత స్థానం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు, గిరిజన, దళిత ఓటర్లంతా కాంగ్రెస్‌ వైపే ఉన్నారన్నారు. గతంలో వీరంతా కేసీఆర్‌‌ నమ్మి మోసపోయారన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి కానుందన్నారు. ఇక పాలకుర్తిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఆరు సార్ల ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ గెలిచి ఓటమి ఎరుగని నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌‌రావును తమ అభ్యుర్థి యశస్వినిరెడ్డి ఈ ఎన్నికల్లో మట్టికరిపించారని ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభావం లేకున్నా అనతి కాలంలోనే పాలకుర్తి ప్రజలకు చేరువై ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను లక్ష్మీనారాయణ నాయక్​ అభినందించారు. ఇక కాంగ్రెస్‌ పాలనలో పాలకుర్తికి మంచి రోజు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌‌ లీడర్లు ఎర్రమల్ల సుధాకర్‌‌, చెంచారపు బుచ్చిరెడ్డి, అన్వర్, శ్రీనివాసాచారి,  గౌస్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.