6 నెలల్లో అందరికీ దళితబంధు, గృహలక్ష్మి

6 నెలల్లో అందరికీ దళితబంధు, గృహలక్ష్మి
  • పాలకుర్తిని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశా
  • వచ్చే ఎన్నికల్లో 60 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధిస్తా
  • కార్యకర్తల సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి 

ముద్ర, పాలకుర్తి: వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఒక్కరికి దళిత బంధు, గృహలక్ష్మి అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.  ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు, గృహలక్ష్మి పథకాలపై అపోహలు అవసరం లేదని, సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. గడిచిన పదేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, 24 గంటల కరెంట్, దళిత  బంధు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా నీరాజనాలు అందుకుంటున్నారని కొనియాడారు.  వచ్చే ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త పథకాలను  ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అండదండలతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించామని అన్నారు. గ్యారెంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు మూడోసారి కూడా  కేసీఆరే సీఎం అని ఎప్పుడో గ్యారెంటీ ఇచ్చేశారని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని, అందుకే విదేశాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుంటున్నారని విమర్శించారు. ఝాన్సీరెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో 60 వేల మెజారిటీతో తాను గెలవడం ఖాయమని  మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

కేటీఆర్ సభను విజయవంతం చేయండి

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నియోజవర్గంలోని తొర్రూరులో పర్యటించనున్నారని, ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అనంతరం తొర్రూరులో బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తే చాలు.. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్,  ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు , కార్యకర్తలు పాల్గొన్నారు.