విధేయతకు పట్టం..! 

విధేయతకు పట్టం..! 
  • కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి
  • మంత్రివర్గంలో అద్దంకి...?
  • ఎమ్మెల్యే ఎన్నికల్లో సీటు త్యాగానికి ప్రతిఫలం
  • ఇరువురికి ముఖ్య నేతల ఫోన్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఇద్దరు విధేయులకు కాంగ్రెస్​ అధిష్టానం పట్టం కట్టింది. అగ్రనేతల ఆదేశాలకు కట్టుబడి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సెగ్మెంట్ల నుంచి సీటును త్యాగం చేసిన తుంగతుర్తికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​, హుజూరాబాద్​కు చెందిన ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర నాయకుడు బల్మూరి వెంకట్​లను ఏఐసీసీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించిన వీరిద్దరికి రాష్ట్ర సర్కార్​లో సముచిత స్ధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఇద్దరు అభ్యర్థులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు.  అయితే వీరిలో అద్దంకి దయాకర్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు.

కానీ టిక్కెట్ల కేటాయింపు, సమీకరణల నేపథ్యంలో నాయకత్వం మందుల శ్యామూల్ కు టిక్కెట్ కేటాయించింది. అయితే టిక్కెట్టు రాకున్నా పార్టీపై ఏ మాత్రమూ అసంతృప్తి వ్యక్తం చేయని అద్దంకి..  ప్రస్తుత ఎమ్మెల్యే శ్యామూల్ గెలుపు కోసం పని చేశారు. మరోవైపు.. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలపై తనదైన శైలీలో గళం విప్పిన అద్దంకి దయాకర్​.. అనేక వేదికలపై కాంగ్రెస్ వాదాన్ని బలంగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున అనేక టీవీ చర్చల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహిస్తూ.. చురుకైన నేతగా పేరుతెచ్చుకున్నారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి సైతం అద్దంకి సేవలను కొనియాడారు. మరోవైపు.. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్‌.. విద్యార్థి నాయకుడిగానే కాకుండా పూర్తిస్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 గత ప్రభుత్వ హయంలో.. నిరుద్యోగులు, విద్యార్థుల తరపున తనదైన రీతిలో నిరసనలు, ర్యాలీలతో కాంగ్రెస్ పార్టీ తరపున గట్టి ప్రాతినిధ్యమే వహించారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల తరఫున పోరాడారు. చివరకు హైకోర్టు వరకు వెళ్లారు. అందుకే ఆయనకు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అధిష్టానం బల్మూరి వెంకట్‌ను బరిలో దింపింది. అప్పట్లో అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో ఓడిపోతామని తెలిసినప్పటికీ బల్మూరి గెలుపు కోసం శాయాశక్తులా పోరాడారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బల్మూరి వెంకట్‌ తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని భావించారు. అయినా ఆయనకు భంగపాటు తప్పలేదు.

ఇచ్చిన మాట ప్రకారం..

అధిష్టానం బల్మూరికీ ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. ఇదీలావుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు  ఈ నెల 18న చివరి కావడంతో రెండు రోజుల ముందే అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా వర్గ శ్రేణులు సంబరాల్లో ముగిని తేలారు. ఈ నెల 19న నామినేష్ల పరిశీలన జరనుండగా ఇదే నెల 22 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 29న పోలింగ్‌ జరగనుండగా అదేరోజున సాయంత్రం5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటం, రెండు పదవులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ కావడంతో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమనిస్తోంది.