అధికారులు అన్యాయం చేశారు..

అధికారులు అన్యాయం చేశారు..
  •  మిషన్ వాత్సల్య నియామకాల్లో తప్పులు దొర్లాయి..
  • మెరిట్ జాబితాను ఎందుకు బహిర్గతం చేయలేదు..
  • ప్రెస్ మీట్ లో బాధితుల మొర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అన్ని అర్హతలు ఉన్నా, అధికారులు తమకు అన్యాయం చేశారని, మిషన్ వాత్సల్య నియామకాల్లో తప్పులు దొర్లాయని జిల్లాలోని బాధితులు మొర పెట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో శనివారం మిషన్ వాత్సల్య దరఖాస్తు బాధితులు పుట్ట ఆనంద్, సుప్రియ, రమ్య తులసి, విజయలక్ష్మిలు ప్రెస్ మీట్ నిర్వహించి, తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 1098లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేశామని తెలిపారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 1098ను తొలగించి ఆ ప్రాజెక్టును మిషన్ వాత్సల్యగా మార్చిందన్నారు. జూన్ 2న నూతన రిక్రూట్ మెంట్ కు నోటీఫికేష్ ను విడుదల చేయగా, ఆ నోటిఫికేషన్ వివిధ పోస్టులకు విద్యా అర్హతతో పాటు గతంలో చైల్డ్ లైన్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ఆధారంగా తాము దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.

 ధరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి, మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. ఇతర జిల్లాల్లో గతంలో 1098లో పనిచేసిన వారికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించగా,  జయశంకర్ జిల్లాలో మాత్రం సంబంధిత జిల్లా అధికారులు తమ పెత్తనాన్ని ప్రదర్శించి, అన్ని అర్హతలు ఉన్న తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. జిల్లాలో ముఖ్యస్థానంలో ఉన్న అధికారి చక్రం తిప్పి, మెరిట్ లిస్టు బహిర్గతం చేయకుండా అనర్హులను ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.