మంథనిలో ప్రధాన పార్టీల చతుర్ముఖపోరు 

మంథనిలో ప్రధాన పార్టీల చతుర్ముఖపోరు 
  • చీలనున్న ఓట్లు-చేరికలకు పాట్లు

మహదేవపూర్, ముద్ర: మంథని చరిత్రలో చతుర్ముఖ పోటి ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. సాధారణ శాసనసభ ఎన్నికలలో అనేకమంది అభ్యర్థులు నిలుచున్నప్పటికీ పోటి నువ్వా? నేనా? అనే రీతిలోనే సాగింది. కేవలం 1978లో రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ ఎన్నికలలో రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో సిపిఐ పార్టీకి చెందిన కామ్రేడ్ కనకయ్య మరణించారు. ఎన్నికలకు ఈ సంఘటన అడ్డు రాకపోవడంతో చంద్రుపట్ట నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 1952లో జరిగిన ద్విముఖ పోటీలో సోషలిస్టు పార్టీకి చెందిన గులుకోట శ్రీరాములు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రఘునాథ్ కాచే ఓడిపోయారు. 1952 నుండి 1972 వరకు నాలుగు మార్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు గెలుపొందారు. 1983, 85, 89 సాధారణ ఎన్నికలలో మూడు మార్లు గెలుపొందిన శ్రీపాదరావు ద్విముఖ పోటీని ఎదుర్కొన్నారు. 1994లో ద్విముఖ పోటీలోనే తెలుగుదేశం పార్టీ చంద్రుపట్ల రామ్ రెడ్డి గెలుపొందారు.

1999,2004 సంవత్సరంలో పోటీ చేసి రెండు సార్లు ద్విముఖ పోటీలోనే ఎమ్మెల్యేగా  శ్రీధర్ బాబు గెలుపొందారు. 2009లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ, టిఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2014 ఎన్నికలలో ద్విముఖ పోటీలో శ్రీధర్ బాబుపై తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పుట్ట మధూకర్ విజయం సాధించారు. 2018 ఎన్నికలలో తిరిగి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొంది కొనసాగుతున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నడూ లేని రీతిలో మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబు, భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పుట్ట మధుకర్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చంద్రుపట్ట సునీల్ రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా చల్ల నారాయణరెడ్డిలు బరిలో నిలిచారు. పార్టీ టికెట్లు ప్రకటించక ముందు శ్రీధర్ బాబు మరియు పుట్ట మధుల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా భావించారు. అనూహ్య రాజకీయ పరిణామాలతో నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా పోటీ ఇచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. తాజాగా బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి టికెట్ ఆశించిన నారాయణరెడ్డి బిఎస్పి పార్టీ నుండి బరిలో నిలిచి నియోజకవర్గంలో కార్యకర్తలను సమీకరించుకోవటం నేడు చర్చనీయాంశంగా మారింది. ఎవరి ఓట్లు ఎవరు చీల్చుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. బిజెపి పార్టీకి కొంతమేర ఎమ్మార్పీఎస్, జనసేన మద్దతు లభించడంతో యువత క్రమంగా బిజెపిలోకి చేరిపోతున్నారు. మరోవైపు దళిత బహుజన వాదం నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలుగా చర్చలలో నిలవడంతో అది బీఎస్పీ పార్టీకి లాభించే అవకాశాలు ఏర్పడ్డాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత ఓటు బ్యాంకు, బిఆర్ఎస్ పార్టీకి ఉన్న సంస్థాగత ఓటు బ్యాంకులు చెదిరిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయా పార్టీలలోని వారు ఆందోళన చెందుతున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఈ నాలుగు పార్టీల ప్రభావం తీవ్ర రూపం దాల్చనున్నది. మంథని నియోజకవర్గంలో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, బీజేపీ పార్టీలు గ్రామ గ్రామాన చేరికల కోసం పాట్లు పడుతున్నాయి. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం నాలుగు పార్టీలలో నిత్యకృత్యంగా మారింది. తమ అనుకూల వర్గాల ఓట్లు చీలుతాయని లోలోపల మదన పడుతున్నారు. దీంతో చేరికలను ప్రధాన పార్టీలు బాగా ప్రోత్సహిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం బిజెపి బీఎస్పీ పార్టీల ప్రభావాన్ని మొత్తం మీద పరిగణలోకి తీసుకోవడం లేదు. బిజెపి వల్ల, బీఎస్పీ వలన తమకే లాభం జరుగుతుందని ఆయా పార్టీలు ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు. పైగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కార్యకర్తల బలాన్ని, ఆర్థిక అంశాలను మాత్రమే నమ్ముకుని ధీమాగా ఉన్నట్లు అవగతమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం అందరినీ ఆదరిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎటువైపు మొగ్గుతారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.