అభ్యర్థులెవరో తేలింది.. సమరమే మిగిలింది..

అభ్యర్థులెవరో తేలింది.. సమరమే మిగిలింది..
  • బీఆర్ఎస్ లో తొలగిన ప్రతిష్టంభన..
  • భూపాలపల్లిలో త్రిముఖ పోటీ..?
  • ఎన్నికలెప్పుడైన 'సై' అంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో దాదాపు తేలిపోయింది. ఇక సమరమే మిగిలింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో టికెట్ ఎవరికి వస్తుందో ననే ఉత్కంఠ ఉండేది. ఇటీవలే భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీలో ఉన్న ప్రతిష్టంభన తొలగిపోయినట్లు అయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుండి చందుపట్ల కీర్తిరెడ్డిలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. ఆయా పార్టీల్లో ఆశావాహులు ఎవరు లేకపోవడంతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వారే బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ప్రకటించడంతో భూపాలపల్లి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉత్కంఠ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ లో నూతనోత్సాహం..

భూపాలపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారిల మధ్య భూపాలపల్లి టికెట్ ఎవరికి వస్తుందో ననే ఉత్కంఠ ఉండేది. టికెట్ కోసం రెండు వర్గాలుగా ఇరువురు నేతలు తిరిగారు. ఈ పరిస్థితులలో వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, నాటకీయ పరిణామాల మధ్య మాజీ స్పీకర్ ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు కలిసి తమకు సహకరించాలని కోరడం, దానికి మాజీ స్పీకర్ సానుకూలంగా స్పందించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో వర్గాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపైకి వచ్చినట్లయింది. వర్గాలన్నీ ఒకే గొడుగు కిందకు రావడంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. పరిస్థితులను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణ రెడ్డికి మరోసారి విజయం వరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.- బీఆర్ఎస్ తో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్, బిజెపిలు.. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి గ్రామాలలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు కూడా తనదైన శైలిలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల మంచి చెడులను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు అందరూ సన్నద్ధం కావాలని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచనలు చేస్తున్నారు. కార్యకర్తల సూచన మేరకు ఆయా గ్రామాల్లో శుభ అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ప్రధాన అభ్యర్థులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తుండడంతో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.