బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా

బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో చేరిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధ కలిగిందని చెప్పారు. కరీంనగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీలో స్థానిక నాయకులు సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి లేని నాయకునిగా కొనసాగుతున్నానని, ప్రజల ఆశీస్సులు ఉంటే కరీంనగర్ నుండి బరిలో నిలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో తన సన్నిహితులు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే చేరడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో తమ వంతు కృషి చేశానని వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. స్మార్ట్ సిటీ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని అయినా కూడా అంతర్గత రోడ్లు ఇప్పటికీ అలాగే ఉండడం దురదృష్టకరం అన్నారు.