అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ-అడగపోయిన దళిత బంధు, బీసీ బంధు, పెన్షన్ రెట్టింపు, గృహలక్ష్మీ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా అన్ని ప్రాంతాలను, ప్రజలను సమ దృష్టితో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు మరోమారు అవకాశం ఇవ్వాలని కోరారు.

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తిచేసుకుని, మళ్లీ ఎన్నికలకు రాబోతున్నామని మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పారు. జిల్లాల పునర్విభజణలో భాగంగా 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాలను ఏర్పాటు చేసి, పరిపాలన సౌలభ్యం మెరుగుపరిచారని, 33జిల్లాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.