పని చేసిన.. ఓట్లు అడుగుతున్న..

పని చేసిన.. ఓట్లు అడుగుతున్న..
  • అభివృద్ధి బీఆర్ఎస్ కే సాధ్యం..
  • భూపాలపల్లిని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పని చేసి, సమస్యలను పరిష్కరించి ఓట్లు అడుగుతున్నానని మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే భూపాలపల్లిని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి సింగరేణి 8వ గని, ఓసీపీ 3 ఆవరణలో గురువారం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ తో కలిసి వెంకటరమణా రెడ్డి ఓటువేసి గెలిపించాలని కార్మీకులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టి ఎంతోమంది సింగరేణి కార్మికుల కుమారులకు ఉద్యోగావకాశం కల్పించారని, మళ్లీ కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే రానున్న రోజులలో సింగరేణి సంస్థ  మరింత బలోపేతం చేస్తారని చెప్పారు.

సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయాలని బిజెపి పార్టీ ప్రధాన నరేంద్ర మోడీ చెప్పినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మైన్ లను కూడా ప్రైవేటీకరణ చేయకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. భూపాలపల్లి సింగరేణి లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి కష్టాన్ని నా కష్టంగా భావించి వారి యోగక్షేమాల్లో ఎల్లప్పుడూ ఉంటున్నాని మరొక అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోల్ ఇండియా కంటే ఎక్కువగా 32 శాతం లాభాల వాటా ఇస్తుందని కార్మికులందరూ పనిచేసే ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు 1000 క్వార్టర్స్, రామప్ప కాలనీ ఏర్పాటు చేసి వారికి గృహం లేదనే బాధల నుంచి విముక్తి చేశానని అన్నారు. సింగరేణి కాలరీస్ లో తండ్రి, కొడుకులు ఉద్యోగాలు 1981 వ సంవత్సరం జనవరి 29న మొదలైంది కానీ, మన ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక జాతీయ కార్మిక సంఘం వారి స్వంత లాభం కోసం కోర్టుకు వెళ్లి నిలిపివేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 12000మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 6వ వార్డులలో కాలనీ వాసులను నేరుగా కలిసి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.  వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కు స్థానిక మహిళలు, పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. కృష్ణ కాలనీ, యాదవ కాలనీలోని ప్రజలకు  2018 ఎన్నికల ప్రచారంలో ఇండ్ల పట్టాల సమస్యను, నీళ్ల సమస్యను లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఆరోజు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రత్యేకంగా జీవో ఏర్పాటు చేసుకొని ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించడం జరిగిందని ఆయన వివరించారు. భూపాలపల్లి పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, పట్టణానికి నాలుగు వైపులా స్మశాన వాటికలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేసి, ఓటు అడుగుతున్న కాబట్టి ప్రజలు మరో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.