చర్చల పేరుతో నక్సల్స్ ను మోసగించింది కాంగ్రెస్

చర్చల పేరుతో నక్సల్స్ ను మోసగించింది కాంగ్రెస్
  • బిఆర్ఎస్ అభ్యర్థి కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: శాంతి చర్చల పేరుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో నక్సల్స్ ను మోసగించి అత్యధిక ఎన్కౌంటర్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ శివారు శివారెడ్డి పల్లిలో నిర్వహించనున్న సీఎం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం శివుని పల్లి పద్మావతి గార్డెన్స్ లో మాదాసు వెంకటేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్థానిక అభ్యర్థి ఇందిర నాపై సభ్యత మరిచి మాట్లాడడం సరికాదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అని, ఒకరికి అమ్మిన భూమి మరొకరికి అమ్మిన ఇందిర ఓ చీటరని ధ్వజమెత్తారు.

2018 ఓటమి నుండి నేటి ఎన్నికల దాకా ఎవరికి కనిపించని ఇందిర కు ఓటేస్తే అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి పోతామన్నారు.2004 నుండి 2014 వరకు జరిగిన ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని నన్ను తప్పు పట్టడం సరి కాదని శ్రీహరి స్పష్టం చేశారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో అధోగత పాలు చేస్తే 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పచ్చబడి ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ ను అధిగమించి దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో బిజెపి బలహీన పడిందని ప్రజలకు అందుబాటులో ఉండని వ్యక్తి కి టికెట్ ఇస్తే రేపు డిపోజిట్ కూడా దక్కదు అన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు టిఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి వచ్చిన వెంకటేష్ తో సహా అందరినీ కాపాడుకుంటానని శ్రీహరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీపీ రేఖ, అన్నం బ్రహ్మారెడ్డి, మెట్టిల్లి రమేష్, బూర్ల శంకర్, చేపూరి వినోద్ కుమార్, చల్ల సుధీర్ రెడ్డి, బెల్దే వెంకన్న, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, సారంగపాణి, నరసింహులు, బెల్లపు వెంకటస్వామి, ఆకుల కుమార్, సురేష్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.