రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, సంక్షేమం..

రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, సంక్షేమం..
  • దేశంలో ఆదర్శనీయంగా మెరుస్తున్న తెలంగాణ..
  • ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ దే అధికారం..?
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని, దేశంలోనే తెలంగాణ ఆదర్శనీయంగా మెరుస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం లబ్దిదారులకు మంజూరైన సీఎం సహయనిధి, కళ్యాణ లక్ష్మీ, బీసీ బంధు చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించి ముందుకు వెళ్తున్నారని అన్నారు. రాష్ట్ర వనరులు, ఆదాయం తెలియని ప్రతిపక్షాలు అమలుకు ఆచరణలో లేని హామీలు ప్రకటిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ఆది నుంచి తెలంగాణ యాస, గోస తెలిసిన నేత కేసీఆర్ అని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా  ముఖ్యమంత్రి  పరిపాలన ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమజ్జీవిగా అమలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించి, అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు.

భూపాలపల్లి మండలానికి చెందిన 31మందికి రూ.3,103,596ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు, 24మంది లబ్ది దారులకు రూ.2400000ల బీసీ బంధు చెక్కులు, ఆరుగురికి రూ.310000ల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు ప్రభుత్వం నుండి మంజూరు కాగా పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల అభ్యున్నతికి బీసీ బంధు పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా,  ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని,బీసీ బంధు పక్రియ విడతల వారీగా సాగుతుందని, రాని వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనారోగ్యంతో కార్పొరేట్ దవాఖానలో చికిత్స తీసుకుని ప్రభుత్వ సహాయం కోరిన పేద కుటుంబాలకు సీఎం సహాయ  నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.అదేవిధంగా పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు మేనమామ లాగా రూ.100116ల చేయూత అందిస్తూ,రైతులకు రైతు బంధు, రైతు భీమా, 24గంటల విద్యుత్తు సరఫరా అందించడం లాంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టిన బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలువాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శైలజ, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.