జనగామకు అదనపు బ్యాలెట్ యూనిట్లు
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ అసెంబ్లీ బరిలో 19 మంది అభ్యర్థులు ఉండడంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను కెటాయించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్ కె.రాజమణి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ విధానం ద్వారా కేటాయింపులు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్‌లో నుంచి అదనంగా 347 బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు.
కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి సుహాసిని, జనగామ రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ, ఎన్ఐసీ జాయింట్ డైరెక్టర్ రాంప్రసాద్, రాజకీయ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ ఉడుత రవి, బీఆర్ఎస్ రావెల రవి, బీజేపీ విజయభాస్కర్, సీపీఎం జె.ప్రకాష్ , కలెక్టరేట్ ఏవో పి.రవీందర్, ఈడీఎం దుర్గారావు, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.