అబద్దాల కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలి

అబద్దాల కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలి
  • కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెస్తా
  • చేసిన అభివృద్ధి చెప్పలేక మత రాజకీయాలు చేస్తున్న బండి
  • 5 ఎంపీలం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చాం
  • పదేళ్ళలో తెలంగాణ ప్రగతి ని పరుగులు పెట్టించాం

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు ఒక్కటయ్యాయని...ఇప్పటి వరకు కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థినే ప్రకటించకపోవడం దేనికి సంకేతమని కరీంనగర్  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మైనారిటీ నాయకుడు జమీల్ గార్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని...ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని.. ఈ అబద్దాల కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ప్రచార అస్త్రాలు..గారడీ మాటలతో  మోసం చేస్తున్న బీజేపీ కి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు  150 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు మాత్రం ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదన్నారు.

ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ నయాపైసా అభివృద్ధి చేయలేదని...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ...మత రాజకీయాలు చేస్తున్నారని....చేసిన అభివృద్ధి చెప్పమంటే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులు తాను తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. బండి సంజయ్ అసమర్థత ద్వారా కరీంనగర్ కు రావాల్సిన ట్రిబుల్ ఐటీ ఇతర రాష్ట్రాలకు వెల్లిందని...బండి సంజయ్ ఒక్క గుడికి నిధులు తేలేదన్నారు. నేను 2014నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్-మనోహరబాద్ రైల్వేలైన్ తెచ్చాను, కరీంనగర్ లో 25 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి నిధులు తెచ్చాను...కొండగట్టు ఆలయానికి 332 ఎకరాల ఫారెస్టు భూమిని కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తీసుకొస్తానని..ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి  ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలన్నారు. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ చేసి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. 2004లో ఐదుగురు ఎంపీలం గెలిచి  పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడినం...కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్నడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించలేదన్నారు.32 రాజకీయ పార్టీల దగ్గరకు తిరిగి, 28 రాజకీయ పార్టీలను ఒప్పించి పార్లమెంట్ లో గళమెత్తితే విధిలేని పరిస్థితి లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ లను ఎదిరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల గొంతుక తప్పకుండా ఉండాలన్నారు.