కెసిఆర్ పాలన లేని తెలంగాణ ను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు

కెసిఆర్ పాలన లేని తెలంగాణ ను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు
  • మంచి కొరకు నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలది
  • నా  గెలుపే దీనికి నిదర్శనం 
  • అధికారం ఉన్నా లేకున్నా అప్పుడు.. ఇప్పుడు ..
    ఎప్పుడూ ఒకేలా ఉంటాము
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదు... నెరవేర్చినట్లు చరిత్రలో  లేదు
  • ప్రశ్న రావాలి అప్పటివరకు ఓపికగా ఉండాలి
  • ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారు ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలి
  • చిల్లర వేషాలు మన నల్లగొండలోనే అధికంగా ఉంటాయి
  • వృద్ధ సింహం గాండ్రిస్తుంది అసెంబ్లీకి పోకున్నా అన్ని చేస్తానంటుంది ఎలా చేస్తాడని? ప్రజలే చర్చించుకుంటున్నారు
  • విద్యుత్ పై అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతాను
  • బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే  నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు అందరూ బిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయినప్పటికీ సూర్యాపేట మాత్రం బొడ్రాయిలానిలిచి గెలిచిందని అన్నారు. మళ్లీ ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని గెలుస్తామన్నారు. మంచి కొరకు నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని అందుకు నా ఈ గెలుపే నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని అవి మరల పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా  పదేళ్లు అధికారంలో ఉన్నారని ఒక వాదన తీసుకువచ్చి తప్పుదోవ పట్టించారని అన్నారు. రెండుసార్లు తెలంగాణలో అధికారం ఇస్తే కెసిఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశారని అన్నారు.

రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గెలిచేందుకు నీళ్లు కరెంటు రోడ్లు సరిపోతాయని అంటున్నారన్నారు. కెసిఆర్కు ఉన్న విజన్,  ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్లకు లేదని అన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు. నాలుగేండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని ఆ రాష్ట్రం ముందు ముందు మంచిగా ఉండాలంటే మనం ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే చిల్లర వేషాలు మొదలయ్యాయని ఇవి మన నల్లగొండలో ముఖ్యంగా సూర్యాపేటలో అధికంగా ఉంటాయన్నారు. కెసిఆర్ కొట్లాటలు గొడవలు ఉండొద్దని అవి అభివృద్ధికి ఆటంకాలని పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉంచారాని గుర్తు చేశారు. మనలాగా చేయడం ఎవరితోనూ కాదని అది అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికల ముందే నేను చెప్పినట్లుగానే వృద్ధ సింహం గాండ్రిస్తుందని అసెంబ్లీకి పోకున్నా , అన్ని చేస్తామని అంటున్నాడని ఎలా చేస్తాడు ఏం చేస్తాడు? నాలా 24 గంటలు కష్టపడి నాతో కలిసి నాలుగు గంటలకు లేస్తాడా అని అన్నారు.

సూర్యాపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఆలోచనతో డివైడర్ కట్టించామని ఇప్పుడు ఆ డివైడర్ను తొలగించి రోడ్డు ప్రమాదాలకు కారకులు కాబోతున్నారని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాడే బోరు బావులు మూసివేయించాడని బోరు బావుల్లో పడితే పెద్ద వార్త అని గత పదేళ్లగా ఒక పిల్లవాడు కూడా బోరుబావిలో పడిన సంఘటన లేదన్నారు. చేష్టలతో ప్రజలను మెప్పించలేరని తిరుగులేని అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు మనం ఒకేలా ఉన్నామని ఉంటామని అన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి వేస్తామని అంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాము అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు. ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి  కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ అన్నారు .కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చరని, నెరవేర్చినట్లు చరిత్రలో కూడా లేదన్నారు. రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన హామీలు అమలు కావని ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు.

గత ప్రభుత్వాల్లో 6, మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే ఇప్పుడు 18  మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నామని, అప్పుడు జెన్కో ఆస్తులు 18 వేల కోట్లు అయితే ఇప్పుడు 50 వేల కోట్లు అయ్యాయని, ఇప్పుడొచ్చింది ఆరు గంటల కరెంటు అయితే ఇప్పుడు నేను ఇచ్చేది 24 గంటల కరెంట్ అని అన్నారు. చేసేందుకు దమ్ము ధైర్యం ఉండాలని సాకులు చెబితే నడవదని అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతాను అన్నారు. నడిపిన వారమంతా అసెంబ్లీలోనే ఉన్నామని మాట్లాడతామని అధికారం ఎక్కువ రోజులు ఏం ఉండదని అవకాశాలు వాళ్లే ఇస్తారని మనంఅందిపుచ్చుకోవాలన్నారు. రెండు మూడు రోజుల జరుగుతున్న సంఘటనలతో ఇక్కడ నేను గెలిచాను కాబట్టి నాకు ఓటు వేయని వారు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారని అన్నారు. అధికారం ఉన్న లేకున్నా అనిగిమనిగి ఉండడం రాజకీయంగా తరగని పెట్టుబడి అని అన్నారు. అధికారంలో ఉన్న వారి వైపే అధికారులు ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని దానిపై ఆలోచన చేద్దామన్నారు. ప్రజలు విజ్ఞులని వారు ఆలోచన చేస్తారని అన్నారు . పార్టీ ఏ పిలుపునిచ్చిన వెంటనే స్పందించడమే  మనప్రధాన బాధ్యతఅన్నారు. అధికారంలో ఉన్నా  లేకున్నా ప్రజల తరఫున పోరాడటమే మన ప్రధాన కర్తవ్యమని దీన్ని నాయకులు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని చైతన్యవంతులై పని చేయాలని పిలుపునిచ్చారు.