హుస్నాబాద్‌కు తొలిసారి దక్కిన మంత్రి పదవి

హుస్నాబాద్‌కు తొలిసారి దక్కిన మంత్రి పదవి

హుస్నాబాద్ ముద్ర న్యూస్: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇందుర్తి నియోజకవర్గం మొదలు ఇప్పటివరకు మంత్రి పదవి రాలేదు. ఆ ఘనతను తాజాగా పొన్నం ప్రభాకర్‌ సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అనూహ్యంగా టికెట్‌ సాధించిన ఆయన.. పార్టీలోని అన్నివర్గాలను.. అసంతృప్తులను కలుపుకొని వెళ్లారు. నెమ్మదిగా ప్రచారం చేపట్టినా.. చివరకు స్పీడ్‌ పెంచి మంచి విజయాన్ని అందుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేగా గెలవడం.. పార్టీలో సీనియర్‌ కావడంతో రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఆయనకు చోటు లభించింది. హుస్నాబాద్‌ ఒకప్పుడు ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది. అప్పటినుంచి ఎవరూ గెలిచినా.. ఏదో కారణంతో మంత్రి పదవి మాత్రం ఈ నియోజకవర్గానికి దూరమవుతూనే ఉంది. గతంలో ఇందుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బొప్పరాజు లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి వస్తుందని అప్పట్లోనే అందరూ భావించినా.. పీవీ నరసింహారావు కూడా కరీంనగర్ జిల్లా నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం.. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఆయనకు పదవి రాలేదు.

తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం.. ఇక్కడి నుంచి లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందడంతో ఈ సారి కూడా పదవి రాలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బొమ్మ వెంకన్న విజయం సాధించినా.. ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వొడితెల సతీశ్‌కుమార్‌ ఇక్కడి నుంచి గెలవడంతో మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే సిరిసిల్ల నుంచి కేటీఆర్‌కు.. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్‌కు.. కరీంనగర్‌ నుంచి గంగుల కమలాకర్‌కు.. హుజూరాబాద్‌ నుంచి ఈటల రాజేందర్‌కు అవకాశం రావడంతో సతీశ్‌బాబుకు మంత్రి పదవి దూరమైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పొన్నం ప్రభాకర్‌ టికెట్‌ దక్కించుకోవడం.. పార్టీలో సీనియర్లందరినీ ఒప్పించడం.. ఎన్నికల్లో గెలవడం.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా సాగాయి. పొన్నం ప్రభాకర్ డీసీఎంఎస్ ప్రెసిడెంట్‌గా.. మార్క్ఫెడ్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి వివరించడంతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.