కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటల కరెంటు కట్

కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటల కరెంటు కట్

రేవంత్ రైతు వ్యతిరేకి
కాంగ్రెస్ వస్తే ఏపీలో తెలంగాణను కలిపేస్తారు
రేవంత్, చంద్రబాబు ఆదుతున్న నాటకం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే 24 గంటల కరెంట్ కట్ చేస్తారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదన్న ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బిఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ చౌక్ లో  రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీయడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అన్నారు. 2018లో ఏర్పడిన మహా కూటమి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతుందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం రేవంత్ కు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా రేవంత్ తో చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని అన్నారు. ఆంధ్ర, కర్ణాటకలో 24 గంటల ఉచిత కరెంట్ లేదని వెల్లడించారు.

మూడు గంటల కరెంట్ ఇచ్చే పార్టీకి మూడు సీట్లే వస్తాయని ఎద్దేవా చేశారు. మూడు గంటల కరెంట్ వల్ల ఆత్మహత్యలు పెరుగుతాయన్న కనీస జ్ఞానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఇక్కడి కరెంట్ ను ఆంధ్రా కర్ణాటక కు ఇచ్చే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణ ను ఏపీలో కలిపేస్తారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తంచేశారు.  గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ  రైతు వ్యతిరేక విధానాలను  బయటపెట్టుకుందన్నారు.  కాంగ్రెస్ విధానాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోటరాములు తోపాటు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.