కులవృత్తులకు  జీవం పొసేందుకే లక్ష సాయం

కులవృత్తులకు  జీవం పొసేందుకే లక్ష సాయం
  •  ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం తో బతకాలి
  •  బీసీ బంధు  పథకం నిరంతర ప్రక్రియ: మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తుల కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32 మంది కులవృత్తులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బీసీ కుటుంబం  ఆత్మగౌరవం తో బ్రతకాలని అన్నారు. గత ప్రభుత్వల హయాంలో  ఇచ్చే రుణాలకు బ్యాంకు గ్యారంటీ లు అడిగేవారు తెలంగాణ ప్రభుత్వం అందజేసే లక్ష సాయానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా అందజేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి బీసీ కులానికి హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేట లో విలువైన భూమిని కేటాయించారని అన్నారు.

 చేతి కుల వృత్తులకు సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నామని వెల్లడించారు.  సీఎం కెసిఆర్ అందిస్తున్న లక్ష సాయంతో ప్రతి లేబరు ఓనర్ కావాలని ఆకాంక్షించారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియఅని ఎవరు నిరాశ పడకూడదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడుదలవారీగా సాయం అందిస్తామని వెల్లడించారు. నిజమైన లబ్ది దారులకు  సాయం అందజేయాలనే సంకల్పంతో పగడ్బందీగా దరఖాస్తులు పరిశీలిస్తున్నామని వెల్లడించారు.  ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు,  ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బారసా నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.