కాంగ్రెస్ లో చేరేది వీరే....

కాంగ్రెస్ లో చేరేది వీరే....

క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి జూపల్లి వనపర్తి లో భారీ వాహనాల ర్యాలీ

ముద్ర ప్రతినిధి, వనపర్తి : కొల్లాపూర్ లో ఈనెల 20వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో జరిగే పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరుతున్నట్లు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. మంగళవారం వనపర్తి లో భారీ కాన్వాయ్ ర్యాలీ నిర్వహించిన జూపల్లి కృష్ణారావు అంబేద్కర్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగి మాట్లాడారు. పిసిసి ఆధ్వర్యంలో కొల్లాపూర్ లో ఈనెల 20వ తేదీన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సభకు జాతీయ కాంగ్రెస్ నాయకులు హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ సభలో తనతోపాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఇటీవల టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తో పాటు వారి అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చేరికతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఆయన చెప్పారు.