మోసపోయి గోస పడొద్దు

మోసపోయి గోస పడొద్దు
  • నాకు దందాలు లేవు.. చందాలు తెల్వదు
  • ఉన్నదల్లా మీరే... మీ అభివృద్ధే నా లక్ష్యం
  • బీజేపీ జనగామ అభ్యర్థి ఆరుట్ల దశమంత్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : రెండు సార్లు రాష్ట్రాన్ని అప్పగించి అవస్థలు పడ్డాం.. మళ్లీ వారి మాయమాటలకు మోసపోయి గోస పడొద్దు అని బీజేపీ జనగామ అసెంబ్లీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని నర్మెట మండలంలోని మల్కపేటలో ఆరుట్ల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట దళితుడిని సీఎం చేస్తానని ఓట్లు వేయించుకు కేసీఆర్ గెలిచిన తర్వాత ఆ మాట మర్చిపోయారన్నారు.

2018లో ఆరు నెలల ముందే తెలంగాణకు ఎన్నికలు తీసుకొచ్చి సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. ఐదేళ్లు పూర్తి కావస్తున్న ఒక్కరికి కూడా రూ.5 లక్షలు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఇప్పడు దొంగ హామీలతో మరో సారి ముందుకు బీఆర్‌‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తాను స్థానికుడినని, జనగామ జిల్లా సాధనలో ముందుండి పోరాటం చేశానని దశమంతరెడ్డి పేర్కొన్నారు. తనకు ఎలాంటి దందాలు కానీ, చందాలు వసూలు చేసే అలవాటు కానీ లేదన్నారు. కలమం పువ్వ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఆరట్లు వివరించారు. ఆయన వెంట ఉడుగుల రమేశ్, కొంతం శ్రీనివాస్, సౌడ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.