కాళేశ్వరం కూలగొట్టే పరిస్థితి నెలకొంది

కాళేశ్వరం కూలగొట్టే పరిస్థితి నెలకొంది
  • కెసిఆర్ కు బినామీ కిషన్ రెడ్డి
  • స్లిప్పర్ చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించారు
  • మహిళల ఉచిత ప్రయాణం బిఆర్ఎస్ కు ఇష్టం లేదా
  • రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : సాంకేతికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేసే పరిస్థితులు లేవని ప్రాజెక్టు కూలగొట్టే స్థితి నెలకొందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు దేవాదుల, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. 6గ్యారంటీలను పక్క గా అమలు చేస్తామని వాటి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అధికారంలోకి వచ్చి నెల రోజుల కూడా కాలేదు అప్పుడే మాపై 420 అని ముద్ర వేసి ప్రచారం చేయడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు.

అగౌర పరుస్తూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడానికి 379 ,384 ,393 395 సెక్టన్లు అప్లికేబుల్ అవుతాయని హెచ్చరించారు. స్లిప్పర్ చెప్పులతో వచ్చిన వారికి వందల కోట్ల ఫామ్ హౌజ్ లు ఎలా వచ్చాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంపద ను దోచుకుని రాష్ట్రాన్ని లూటీ చేసింది బిఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పు చేసిందని స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రతిపాదిస్తే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారని కిషన్ రెడ్డి కేసీఆర్ కు బినామీ అని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్లు మా కుటుంబ సభ్యులు వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలకు బస్ ఉచిత ప్రయాణం బిఆర్ఎస్ కి ఇష్టం ఉందా లేదో స్పష్టం చేయాలన్నారు. కావాలని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటివరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత టికెట్ పై ప్రయాణం చేశారని తెలిపారు.