చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • పద్మవిభూషణ్ రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి హర్షం
  • మెగాస్టార్ మరిన్ని ఉన్నతస్థానాలకు ఎదగాలని, అవార్డులు రావాలన్న కోమటిరెడ్డి
  • భవిష్యత్తులో భారతరత్న రావాలని ఆకాంక్షించిన మంత్రి   

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవిని వరించింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లారు. పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. మెగాస్టార్ మరిన్ని ఉన్నతస్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులు, పురస్కారాలు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతరత్న కూడా రావాలని కోరుకున్నారు.

"పునాదిరాళ్ల నుంచి విశ్వంభరదాక... కోట్లాది గుండెల్ని కదిలించి... రక్తదానం నుంచి నేత్రదానం దాక... లక్షల మందికి పునర్జన్మను ప్రసాదించి... మనందరి మనస్సుల్లో చిరంజీవిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ కూడా చేశారు.