'కెప్టెన్ మిల్లర్' - మూవీ రివ్యూ

'కెప్టెన్ మిల్లర్' - మూవీ రివ్యూ
  • ధనుశ్ హీరోగా రూపొందిన 'కెప్టెన్ మిల్లర్'
  • కథ విషయంలో లోపించిన క్లారిటీ 
  • ఎక్కువైపోయిన యాక్షన్
  •  ఎక్కడా కనెక్ట్ కాని ఎమోషన్స్
  • కనిపించని లవ్ .. రొమాన్స్ .. కామెడీ 

మొదటి నుంచి కూడా ధనుశ్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. తెరపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం కోసం, ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలా ఆయన చేసిన సినిమానే 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన తమిళనాట విడుదలైంది. తెలుగులో ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అది ఆంగ్లేయులు భారతీయులపై తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్న కాలం. 'భైరవకోన'లో స్థానికంగా ఉండే సంస్థానాధీశుడు భూపతి రాజా (జయప్రకాశ్) అక్కడి ప్రజలపై చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అధికారం కోసం అన్నను అంతం చేసిన భూపతిరాజా, తెల్ల అధికారులతో కలిసి, గూడెం ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించే ఆలోచనలో ఉంటాడు. ఆ గ్రామంలోనే శివయ్య ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోకి సంస్థానాధీశులు .. అధికారులకు మినహా మరొకరికి ప్రవేశం ఉండదు. 

ఆ గూడెంలో శివన్న ( శివరాజ్ కుమార్) .. అగ్ని ( ధనుశ్) అన్నదమ్ములుగా ఉంటారు. ఆంగ్లేయులకు శివన్న వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. తమ ఊరు గుడిలోకి తమకి ప్రవేశం లేకపోవడం అగ్నికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంస్థానాధీశులు తమను హీనంగా చూస్తూ, ఆంగ్లేయ సిపాయిలకి గౌరవం ఇస్తూ ఉండటంతో ఆ సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంటాడు. 

ఒకసారి సంస్థానాధీశులు గుడికి వస్తున్నారని తెలిసి, యువరాణిని చూడాలనే ఉద్దేశంతో అగ్ని రహస్యంగా దాక్కుంటాడు. యువరాణితో పాటు ఉన్న భానుమతి ( ప్రియాంక అరుళ్ మోహన్)ను చూసి మనసు పారేసుకుంటాడు. అదే సమయంలో సిపాయిల కంటపడతాడు. ఆ సమయంలో భానుమతినే అతణ్ణి అక్కడి నుంచి తప్పిస్తుంది. జమిందార్ భూపతిరాజా అన్నయ్య కూతురే భానుమతి అనీ, ఆమె తండ్రిని అతనే చంపాడనే విషయం అగ్నికి తెలుస్తుంది.

తమ పూర్వీకులలో ఒకరికి తవ్వకాల్లో ఒక వజ్రం దొరికిందనీ .. ఆ వజ్రంపై 'అఘోర హర' బొమ్మను మలిచిన అతను, దానిని జయేంద్ర రాజాకి సమర్పించడనీ, అత్యంత విలువైన ఆ రాయిని ఆ రాజు ఆలయంలోని రహస్య ప్రదేశంలో భద్రపరిచాడని అగ్నితో తల్లికి చెబుతుంది. 'అఘోర హర'తో కూడిన విలువైన ఆ  రత్నాన్ని సొంతం చేసుకోవడానికి ఆంగ్లేయులు ప్రయత్నిస్తున్నారని అతనికి అర్థమవుతుంది. ఆ రత్నాన్ని రక్షించడమంటే తమ గౌరవాన్ని కాపాడుకోవడమేననే విషయం బోధపడుతుంది.  

ఆ పరిస్థితుల్లోనే అతను ఆంగ్లేయ సైన్యంలో చేరతాడు. అక్కడి అధికారులు అతనికి 'మిల్లర్' అనే పేరు పెడతాడు. దానికి 'కెప్టెన్' అనేది తాను జోడిస్తాడు. ఎంతమంది భారతీయులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనేది ఆంగ్లేయ సైన్యంలో చేరిన తరువాత అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేవి ఈ కథలో ముఖ్యమైన అంశాలుగా కనిపిస్తాయి.  

అరుణ్ మాథేశ్వరన్ తయారు చేసుకున్న కథ ఇది. ఈ కథ అంతా కూడా ఆంగ్లేయుల కాలంలో ..  'భైరవకోన' అనే ప్రదేశంలో నడుస్తుంది. ఒక వైపున భారతీయుల పట్ల ఆంగ్లేయులకు గల చులకన భావం .. మరో వైపున సంస్థానాధీశుల అహంభావం .. ఇంకో వైపున తమ దైవాన్ని తామే దర్శించలేని పరిస్థితి. ఆలయంలో భద్రపరచబడిన అమూల్య రత్నం. ఈ నాలుగు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

 ఆంగ్లేయులకు సంబంధించిన ప్రత్యేకమైన సెటప్ ఎక్కడా కనిపించదు. అలాగే 'భైరవకోన'కి సంబంధించిన గూడెం సెట్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపించదు. ఆ కాలం నాటి కార్లు .. ట్రక్కులు .. పోలీస్ డ్రెస్ లు .. ఆయుధాలు మాత్రమే కనిపిస్తాయి. స్థానికంగా సంస్థానాధీశుడైన భూపతిరాజా పాత్ర డమ్మీగా కనిపిస్తుంది. ప్రధానమైన విలన్ ఓ ఆంగ్లేయ అధికారి. అతని ఫేస్ ను గుర్తుపెట్టుకోవడం కష్టం. 

హీరో లక్ష్యం ఒక్కటే .. ఆంగ్లేయుల పెత్తనాన్ని ఎదిరించడం. కానీ మిగతా కారణాలను కూడా వరుసగా చెప్పేసి ఆడియన్స్ ను కాస్త కన్ఫ్యూజ్ చేశారు. దేవాలయం .. రత్నం .. రత్నంపై బొమ్మ .. అఘోర హరుడు .. ఇవన్నీ ఒక కథగా చకచకా చెప్పించడం వలన ఆడియన్స్ కి అయోమయం కలుగుతుంది. ఇక తెరపై తెలుగు సీజీని కూడా సరిగ్గా చూసుకోలేదు .. చాలా అక్షరదోషాలు కనిపిస్తాయి. అవి సినిమా క్వాలిటీని దెబ్బతీస్తాయి.  

అగ్ని పాత్రలో ధనుశ్ ఆకట్టుకుంటాడు. తన కోసం మారిన మనిషిగా .. తనవాళ్ల కోసం మారిన మనిషిగా రెండు కోణాల్లోను అతని నటన మెప్పిస్తుంది. ఇక ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక స్థానంలో కనిపించదు. అందువలన వాళ్లిద్దరి మధ్య లవ్ .. రొమాన్స్ అనే వాటికి అవకాశం లేకుండా పోయింది. శివరాజ్ కుమార్ అక్కడక్కడా కనిపిస్తూ .. తన మార్క్ నటన చూపిస్తారు. ఇక మిగతా పాత్రలు అంతగా గుర్తుపెట్టుకోదగినవిగా అనిపించవు.

సిద్ధార్థ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం సన్నివేశాలతో సంబంధం లేకుండా ముందుకు వెళుతుంది. రామచంద్రన్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణపరమైన భారీతనం ఉంది. బాంబులు .. తుపాకులతో యాక్షన్ సీన్స్ లో హోరెత్తించారు. కానీ ఎమోషన్స్ పరంగా ఎక్కడా కనెక్ట్ చేయలేకపోయారు. పవర్ఫుల్ విలనిజం కనిపించకపోవడం, లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ .. కామెడీకి దూరంగా కథ సాగడం ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగించే అంశాలుగా కనిపిస్తాయి.