నా హైటే ఉన్నడు.. నా లెక్కనే పనిచేస్తడు..

నా హైటే ఉన్నడు.. నా లెక్కనే పనిచేస్తడు..
  • జనగామలో ‘పల్లా’ గెలుపు ఖాయం
  • మెజార్టీ కోసం సిద్దిపేట, జనగామ పోటీ పడదాం..
  • కార్యకర్తలు కలిసి పనిచేయాలి
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

ముద్ర ప్రతినిధి, జనగామ : ‘జనగామ టికెట్‌ పంచాయితీ తెగిపోయింది.. సీఎం కేసీఆర్‌‌ ఆశీర్వదం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి బరిలోకి వచ్చారు.. జనగామలో పల్లా గెలుపు ఖాయమే.. మెజార్టీ కోసమే మా సిద్దిపేట, జనగామ పోటీ పడదాం.. నా హైటే ఉంటడు.. నా లెక్కనే పనిచేస్తడు..’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వహించగా హరీశ్‌రావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జనగామ పోరాటాల అడ్డా.. టీఆర్‌‌ఎస్‌ ఆవిర్భావించిన తొలి నాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసిన ప్రాంతమని గుర్తుచేశారు. అందుకే జనగామ అంటే సీఎం కేసీఆర్‌‌కు ఎంతో ప్రేమ చెప్పుకొచ్చారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారని చెప్పారు. ఇక పల్లా రాజేశ్వర్‌‌రెడ్డితో తనకు 2010 నుంచి అనుబంధం ఉందన్నారు. సీఎం సన్నిహితుడిగా పేరున్న పల్లా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరో సిద్దిపేటను చేస్తాడని పేర్కొన్నారు. సీఎం ఆయనకు టికెట్ ఇవ్వకున్నా.. గొప్ప మనసుతో పల్లాను దీవించిన ఘనత యదన్నది.. అని ముత్తిరెడ్డిని మంత్రి హరీశ్‌రావు మెచ్చుకున్నారు. అదే సమయంలో ఆయన సేవలను గుర్తించే కేసీఆర్‌‌ ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించారన్నారు. పల్లా గెలుపు కోసం కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఒకడు తల్లికి అన్నం పెట్టడు.. ఇంకోడు ఆర్నెళ్ల కోసారి వస్తడు..

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వక ముందే తన్నుకుంటున్నారనని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ అంటేనే మాటలు, గ్రూపులు, ముఠాలు, మంటలు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, గతంలో 11సార్లు గెలచిన కాంగ్రెస్‌ రాష్ట్రానికి ఏం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు, కర్ఫ్యూలు, కరువులు తప్ప ఏమీ లేదన్నారు. కానీ సీఎం కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చిఏ 10 ఏళ్లలో రాష్ట్రం రూపురేఖలు మార్చేశారని కొనియాడారు. మళ్లీ కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే కైలాసంలో పెద్ద పాము నోట్లో పడినట్టు అవుతుందన్నారు. ఇక జనగామ నియోజవర్గంలో కాంగ్రెస్‌కు లీడరే దిక్కులేడన్నారు. ఇక్కడ ఉన్న ఒకడేమో కన్న తల్లికి అన్నం పెట్టడు.. ఇంకొకడు ఆరు నెలలకు ఒకసారైనా ఇటు రాడని.. పరోక్షంగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.  

కేసీఆర్‌‌ సభను సక్సెస్‌ : మంత్రి ఎర్రబెల్లి

ఈనెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్‌‌ సభను లక్ష మందితో సక్సెస్‌ చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశారన్నారు.  60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.  కానీ సీఎం కేసీఆర్‌‌పదేళ్లలో పాలనలో కరువు ప్రాంతంగా ఉన్న జనగామ సస్యశ్యామలంగా మారిందన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసిన జనగామకు నీళ్లు ఇచ్చిన ఘనత హరీశ్‌రావుకే దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దొంగ సర్వేలు చేసి ఈసారి అధికారం మాదే అని చెప్పుకుంటున్నారని.. కానీ వారికి దిమ్మతిరిగే ఫలితాలతో ముచ్చటగా మూడో సారి కేసీఆర్‌‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. 16న జనగామలో జరిగే మీటింగ్‌ను చూసి కాంగ్రెస్ లీడర్లు నామినేషన్‌ వేసేందుకు కూడా భయపడాలన్నారు. సమావేశంలో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్,జడ్పీ చైర్మన్‌, బీఆర్‌‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, బీఆర్‌‌ఎస్ రాష్ట్ర నేత జల్లి సిద్ధయ్య, జనగామ, చేర్యాల మున్సిపల్‌ చైర్మన్లు పోకల జమున లింగయ్య, అంకుగారి స్వరూప శ్రీధర్‌‌రెడ్డి, టీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఇర్రి రమణారెడ్డి, నిమ్మతి మహేందర్‌‌రెడ్డి, బాల్దె సిద్దిలింగం, పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు బండ పద్మ, పేర్నె స్వరూప, ఉల్లెంగుల నవ్యశ్రీ, సుధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.