నామినేషన్‌ వేసిన ‘పల్లా’

నామినేషన్‌ వేసిన ‘పల్లా’
  • రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి 

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి మంగళవారం నామినేషన్‌ వేశారు. ఉదయం పల్లా ఇంటిలో నామినేషన్‌ పత్రలను దేవుడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ముస్లింలు, క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ రాజయ్య, మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, బీఆర్‌‌ఎస్‌ నేత మండల శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ పోకల జమునతో కలిసి ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం కార్యాలయానికి దూరంగానే ర్యాలీని నిలిపి వేసి నడుకుంటూ వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణకు పల్లా తన రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో సుదీర్ఘంగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు అందరు లీడర్ల సహకారంతో ముందుకు సాగి విజయం సాధిస్తానని పేర్కొన్నారు. జనగామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని పల్లా పేర్కొన్నారు. ఆ తర్వాత అక్కడి పట్టణ శివారులో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశం అయ్యారు.