జనగామలో ‘కారు’ జోరు

జనగామలో ‘కారు’ జోరు
  • స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో ‘కడియం’ విజయం
  • పాలకుర్తిలో ‘యశస్విని’ పాగా..
  • జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్
  • బీఆర్‌‌ఎస్‌కు రెండు, కాంగ్రెస్‌కు ఒక స్థానం

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో రెండు స్థానాలను బీఆర్‌‌ఎస్‌ కైవసం చేసుకోగా, ఒకటి కాంగ్రెస్‌ సొంతం చేసుంది.  జనగామలో బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 98,557 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి 82,139 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్‌లో పల్లాకు 418, కొమ్మూరి 1,053 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి తస సమీప ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 15,769 మెజార్టీ విజయం సాధించారు. మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి 7,734 ఓట్లు పోల్‌ అయ్యాయి.  ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇక్కడ గెలిచినందుకు సంతోషంగా ఉన్నా, తమ పార్టీ రాష్ట్రంలో ఓటమిపాలు కావడం బాధగా ఉందన్నారు.  అయినా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తామని, తమ పార్టీ వైఫల్యాలు కూడా సమీక్షించుకుంటామని ఆయన అన్నారు. 

కడియమే ‘స్టేషన్​’ మాస్టర్..


జిల్లాలోని ఎస్సీ రిజర్డ్వ్​ స్థానం అయిన స్టేషన్​ఘన్‌పూర్‌‌లో  బీఆర్‌‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గెలుపొందారు. 21 రౌండ్ల కౌంటింగ్‌లో కడియం 1,01,239 ఓట్లు పోల్‌ కాగా, సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి సింగపురం ఇందిరకు 93,209 ఓట్లు వచ్చాయి. పోటస్టల్‌ బ్యాలెట్లో కడియంకు 457 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ 708 ఓట్లు వచ్చాయి. మొత్తంగా శ్రీహరికి 1,01,696 , కాంగ్రెస్‌ అభ్యర్థికి 93,917 ఓట్లు వచ్చాయి. దీంతో 7,779 ఓట్ల  స్వల్ప మెజార్టీ కడియం విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి గుండె విజయరామారావుకు 4,984 ఓట్లు దక్కించుకుని  మూడో స్థానంలో నిలారు. ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడుతూ స్టేషన్ ఘన్ పూర్ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు రుణపడి ఉంటానన్నారు. 

మంత్రి దయన్న ఓడించిన ‘యశస్విని’


పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మామిడాల యశస్విని భారీ మెజార్గీతో విజయం సాధించారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావును ఊహించని దెబ్బ కొట్టింది. పాలకుర్తి లెక్కింపులో 21 రౌండ్లు ఉండగా.. రెండో రౌండ్‌లో మాత్రమే 452 ఆధిక్యం వచ్చింది. మిగతా 20 రౌండ్లలో యశస్వినిరెడ్డి పైచేయి కావడం గమనార్హం. చివరకు పోస్టల్‌ బ్యాలెట్‌లోను 1180 ఓట్లు రాగా, బీఆర్ఎస్‌ అభ్యర్థికి 418 ఓట్లే వచ్చాయి. మొత్తంగా యశస్వినిరెడ్డికి 1,25,414 ఓట్లు రాగా, దయాకర్‌‌రావు 78,285 ఓట్లు వచ్చాయి. దీంతో 47,129 ఓట్ల ఆధిక్యంతో యశస్వినిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం పాలకుర్తి ప్రజలది అని అన్నారు.