వారు మహానటిని ఆదుకున్నారా?

వారు మహానటిని ఆదుకున్నారా?

మహానటి సావిత్రి ఈమె తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇక ఇప్పటితరం వాళ్ళకు కూడా ఆమె జీవిత చరిత్ర గురించి తెలుసనే చెప్పాలి. అదెలా అంటే ‘మహానటి’ చిత్రంతో ఆమె గురించి తెలియని ఈ తరం వాళ్ళకు కూడా ఆ  చిత్రం ద్వారా వైజయంతి మూవీస్​ దర్శకుడు నాగ్​అశ్విన్​ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక అసలు విషయం ఏమిటంటే...  చివరి రోజుల్లో ఆమె ఎలా జీవించారో అందరికీ తెలుసు. ఆమె జీవితంపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అలాగే 'మహానటి' (2018) సినిమాలో నాగ్ అశ్విన్ ప్రతి అంశాన్ని విపులంగా తెరపై ఆవిష్కరించారు. దీంతో ప్రజల్లో సావిత్రి జీవితంపై పూర్తి అవేర్ నెస్ ఉంది. నిజానికి మహానటి అంటూ సావిత్రిని అందరూ పొగుడుతారు. పరిశ్రమలో నాటి అగ్ర హీరోలందరితోను సావిత్రి నటించారు. అందరికీ ఆమె అత్యంత ఆప్తురాలు సన్నిహితురాలు. కానీ నాడు స్టార్ హీరోలు ఎవరూ తనని కష్ట కాలంలో ఎందుకు ఆదుకోలేదు? అంటూ నెటిజనుల్లో ఒక ఆసక్తికర డిబేట్ కొనసాగుతోంది.

సావిత్రి అవసాన దశలో ఏఎన్నార్- ఎన్టీఆర్ - కృష్ణ- శోభన్ బాబు- మురళీమోహన్ వంటి ప్రముఖ స్టార్లు ఎందుకని ఆదుకోలేదు? కోటీశ్వరులైన వీరంతా సావిత్రి కనీసం బతకడానికి తిండి కూడా ఎందుకు పెట్టలేదు? అంటూ ఒక ఆసక్తికర డిబేట్ నెటిజనుల్లో రన్ అవుతోంది.అయితే నేటితరానికి తెలియని ఒక నిజం ఉంది. నాటి సీనియర్ స్టార్లు ఎవరూ సావిత్రిని అలా కష్టకాలంలో వదిలేయలేదు. వారంతా చేయాల్సిన మార్గంలో సాయం చేశారు. అయితే దానికి అప్పట్లో ఇంతగా మీడియా లేదు గనుక అనవసర ప్రచారం లేదు. సాయం చేసినా ఎవరూ దానికి ప్రచారం కోరుకోలేదు.చాలామంది సీనియర్ ఆర్టిస్టులు సావిత్రికి ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా ఆర్ధిక సహాయం అందించారు. ఏఎన్​ఆర్​ అందులో ప్రథములు. 1980 లో సావిత్రి నెలలో పదిరోజులు అన్నపూర్ణ హోటల్ లో బస చేసేవారు. ఆమె అప్పటికే సంపాదించిన బంగారం వజ్రాలను తన కుమార్తెకు ఇచ్చేశారట. జెమినీ గణేషన్ వల్ల వ్యక్తిగత జీవితంలో సావిత్రి మోసపోయారన్న ప్రచారం ఉంది. అతడు ఆమె సంపాదన ఆమెకు లేకుండా చేశారని గుసగుసలు నాడు వైరల్ అయ్యాయి.