వీరనారి చాకలి ఐలమ్మ - వర్ధంతి వేడుకలో వక్తలు..

వీరనారి చాకలి ఐలమ్మ - వర్ధంతి వేడుకలో వక్తలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: విరోచిత పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె వర్ధంతి వేడుకలో వక్తలు కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలమండలంలోని చల్లగరిగలో ఆదివారం రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, చాకలి ఐలమ్మ 38 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రజకసంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రజక సంఘాల జిల్లా నాయకులు గొల్లపల్లి రాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) అందరికీ ఆదర్శనీయురాలని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, విసునూరు దేశ్‌ముఖ్ పాల‌న‌కు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్పూర్తిని నింపిందన్నారు. ఆమె అనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యింద‌ని చెప్పారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ.. ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో దడ పుట్టించాయ‌న్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన‌ మహనీయురాలు ఐల‌మ్మ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ పెద్దలు జాలిగపు రాజయ్య, గొల్లపల్లి మొగిలి, రాజయ్య, జాలిగపు చద్రయ్య, రవి, రవీందర్, గ్రామ పెద్దలు ఎండీ రబ్బాని, జంపయ్య, నోముల శివశంకర్, మ్యాదరి వీరస్వామి, కేతిరి సదానందం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.