చాంప్స్‌ ఆనంద్‌, అరుణ్‌ జోడీ

చాంప్స్‌ ఆనంద్‌, అరుణ్‌ జోడీ
  • ముగిసిన 17వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ 

హైదరాబాద్‌ : 17వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సోమవారం ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌ సి.వి ఆనంద్‌, హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సంఘం (హెచ్‌ఓటీ) అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డితో విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. పురుషుల 40 ప్లస్‌ డబుల్స్‌ విభాగంలో సి.వి ఆనంద్‌, అరుణ్‌ జోడీ టైటిల్‌ సాధించారు.

ఉత్కంఠగా సాగిన ఫైనల్లో లగ్గాని శ్రీనివాస్‌, రాజా జోడీపై 10-7తో విజయం సాధించారు. మెన్స్‌ 40 ప్లస్‌ సింగిల్స్‌లో తన డబుల్స్‌ భాగస్వామి అరుణ్‌కు సివి ఆనంద్‌ టైటిల్ కోల్పోయారు. 10-4తో ఆనంద్‌పై అరుణ్‌ సాధికారిక విజయం నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌ విభాగాల్లో 30 ప్లస్‌ సింగిల్స్‌లో మంజునాథ్‌, 50 ప్లస్‌ సింగిల్స్‌లో నర్సింహారెడ్డి, 60 ప్లస్‌ సింగిల్స్‌లో రామ్‌రెడ్డి, 70 ప్లస్‌ సింగిల్స్‌లో గజపతి విజేతలుగా నిలిచారు. పురుషుల డబుల్స్‌ విభాగాల్లో సాయిరాంబాబు (70 ప్లస్‌), ఆనంద్‌ స్వరూప్‌, శ్రీనివాస్‌ (60 ప్లస్‌),అజయ్‌, రాహుల్‌ (50 ప్లస్‌), మంజునాథ్‌, సురేశ్‌ (30 ప్లస్‌) టైటిల్స్‌ సాధించారు.