ఈవీఎం గోడౌన్ పరిశీలించిన  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  రాజర్షి షా

ఈవీఎం గోడౌన్ పరిశీలించిన  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ లో గల ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్  రాజర్షి షా అదనపు కలెక్టర్  వెంకటేశ్వర్లుతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అనుకోకుండా ప్రమాదాలు సంభవించిన సమయాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక సామగ్రి, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు హర్దీప్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

రోజు వారి ఖర్చు వివరాలు చూపాలి

అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్ డి లో  స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి  ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్  రాజర్షి షా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం  కలెక్టరేట్ లోని  వీడియో సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు  రమేష్ , వెంకటేశ్వర్లుతో కలిసి   సమావేశం నిర్వహించారు. అభ్యర్థి  చేసిన ప్రతి ఖర్చును లెక్కలో చూపాలన్నారు. వివిధ సెక్షన్ ల  క్రింద ఏమేమి ఖర్చు చేస్తే ఎలా  లెక్కిస్తారో కలెక్టర్  వారికి వివరించారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు  ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిన అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్ల ముద్రణకు సంబంధించి అనుమతి పొందాలని, ముద్రాణా సంస్థలు ఎన్ని ప్రతుల్లో ముద్రించారో, ప్రింటర్ పేరు, మొబైల్ నెంబర్ పొందుపరచాలన్నారు. వాహనాల వినియోగంపై అనుమతి పొందాలన్నారు. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా దాఖలు చేసి ఫార్మ్-26 అఫిడవిట్ లో  తప్పని సరిగా అన్ని అంశాలు పూరించాలని స్పష్టం  చేశారు.  ఈ సందర్భంగా వ్యయ నియంత్రణకు సంబందించిన బుక్ లెట్ తో పాటు  షామియానా, కుర్చీలు, బల్లలు, మైకు, బ్యానర్లు, ఫ్లెక్సీలు,భోజనం, హోటల్ రూమ్స్, వాహనాల అద్దె తదితర వాటికి సంభందించి నిర్థారించిన రేట్ కార్డు ప్రతులను అందజేస్తూ అట్టి ధరలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోలలో ప్రకటనలకు సంబంధించి సమాచార శాఖ  నిర్దారించిన రేట్ కార్డులను వారికి అందజేశారు.  వ్యవ నియంత్రణకు కట్టుదిట్టంగా అమలుకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నదని, అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తామని,  క్షేత్ర స్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకుంటారన్నారు. ఖర్చులకు సంబంధించి మూడు సార్లు క్రాస్ చెక్ చేస్తారన్నారు. ఎస్.ఓ.పి  ఐ.టి. శాఖ వారు పట్టుకున్న డబ్బులకు సరైన ఆధారాలు చూపిస్తే తిరిగి అప్పగిస్తామన్నారు.