జిల్లాలో 7,16,320 మంది ఓటర్లు

జిల్లాలో 7,16,320 మంది ఓటర్లు
  • ఓటర్‌‌ లిస్ట్‌ ఫైనల్ చేసి అభ్యర్థులు అందించాం..
  • జిల్లాలో 21,433 మంది కొత్త ఓటర్లు
  • ఎన్నికలకు అంతా రెడీ
  • జనగామ జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ :ఈనెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీ చేస్తున్నామని, జిల్లాలో ఈసారి 7,16,320 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య తెలిపారు. కొత్త ఓటర్ లిస్ట్​ను ఫైనల్ చేసి ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యుర్థలకు అందజేశామని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సీతారాంతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని జనగామలో 7,449 మంది, స్టేషన్​ఘన్​పూర్‌ 6,174 మంది‌, పాలకుర్తి 7,760 మంది ఓటర్లుగా నమోదైనట్టు వివరించారు. ఇక హోం ఓటింగ్‌ కోసం 929 మంది 80 ఏళ్లు పైపడిన వృద్ధులు అప్లై చేసుకోగా అందులో 814 మందికి అప్రూవల్‌ ఇచ్చినట్టు తెలిపారు. 692 మంది పీడబ్ల్యూడీ పర్సన్స్‌ హోం ఓటింగ్‌ అప్లై చేసుకోగా 662 మందికి అప్రూవల్‌ ఇచ్చినట్టు వివరించారు. వీరు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ఓటు వేస్తారని తెలిపారు. పోలింగ్‌ ఆఫీసర్లు వీరి ఇంటికి వెళ్లినప్పుడు వారు లేకుంటే రెండో సారి కూడా వెళ్తారని తెలిపారు. అప్పుడు అందుబాటులో లేకుంటే మరో సారి వెళ్లరని, వారు పోలింగ్‌ కేంద్రంలో కూడా ఓటు వేసే అవకాశం ఉండదన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తున్నట్టు తెలిపారు. అయితే ఈసారి వారు వారికి కెటాయించి ఆర్వో సెంటర్లలోనే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకున్న వారికి పోలింగ్‌ సెంటర్‌‌లో ఓటు వేయడం కుదరదన్నారు. అలాగే జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఇంటింటికి పోలింగ్‌ స్లిప్‌లను అందజేస్తున్నట్టు కలెక్టర్‌‌ శివలింగయ్య తెలిపారు. ఓటర్లు తమకు ఇచ్చి పోల్‌ చిట్టితో పాటు ఏపిక్‌ కార్డు, గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు వేయాలని సూచించారు. 30న జరిగే పోలింగ్‌ కోసం కావాల్సిన ఈవీఎంలు, వివి ప్యాడ్స్, బ్యాలెట్‌ పేర్లు సర్వం సిద్ధం చేసినట్టు వివరించారు. 

240 సమస్యాత్మక కేంద్రాలు : డీసీపీ సీతారాం

జిల్లా వ్యాప్తంగా ఉన్న 861 పోలింగ్‌ సెంటర్లలో 240 సమస్యాత్మక సెంటర్లు ఉన్న గుర్తించినట్టు  చెప్పారు. మొత్తంగా 508 పోలింగ్‌ సెంటర్లలో వెబ్‌క్యాసింగ్‌ నిర్వహించనున్నట్టు డీసీపీ సీతారాం తెలపారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల కోసం 59.5 సెక్షన్ల బందోబస్తు అవసరం ఉండగా ఇప్పటి వరకు 13.5 మాత్రమే ఉందని, మిగతా 46 సెక్షన్ల బందోబస్తు బయట నుంచి రప్పించనున్నట్టు డీసీపీ వివరించారు. ఇప్పటికే రెండు కంపెనీల బీఎస్‌ఎఫ్​ బలగాలు వచ్చాయని, మరి కొన్ని బలగాలు త్వరలో రానున్నయన్నారు. ఎన్నిలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్​, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్​ పాల్గొన్నారు.