కటకటాలకు కల్లు డిపో డైరెక్టర్...

కటకటాలకు కల్లు డిపో డైరెక్టర్...
  • నాన్ బెలేబుల్ కేసు నమోదు చేసిన  1-టౌన్ పోలీసులు...
  • కల్లు డిపోను సీజ్ చేసిన  ఎక్సైజ్ పోలీసులు...
  • ఖనిలో కలకలం రేపుతున్న కల్తీ కల్లు ఘటన

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బుధవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణ సమీపంలోని అడ్డగుంటపల్లిలో కల్తీ కల్లు సేవించిన ఇద్దరు వ్యక్తులు ఒకరి తరువాత మరొకరు మృతి చెందారు. అడ్డగుంటపల్లికి చెందిన నవీన్, మామిడి రమేష్ అనే రోజు వారి కూలీలు, వారి మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడ్డగుట్టపల్లిలోని నెంబర్ వన్ కల్లు డిపోలో ఇద్దరు కలిసి కల్లు సేవించారని స్థానికులు తేలుతున్నారు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం గోదావరిఖనిలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం కేటాయించిన మద్యాన్ని అమ్ముతున్నారని, రికార్డుల్లో లెక్కలు చెబుతూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని, దీంతో పాపం పేదవారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

దానికి ఉదాహరణ బుధవారం రాత్రి బుధవారం కల్తీ మద్యం సేవించి ఇద్దరు మృతి చెందిన ఘటన... అయినప్పటికీ అధికారులు తూతు మంత్రంగా విచారణ చేసి చేతులు జరుపుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కల్తీ మద్యం అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కల్లు డిపోలు, మద్యం దుకాణాల్లో యదేచ్చగా కల్తీ మద్యం విక్రయాలు నడుస్తున్న పట్టించుకున్న అధికారులే లేరని, అసలు జిల్లాలో అధికార యంత్రం పనిచేస్తుందా... లేదా అని అనుమానం ప్రజలకు కలుగుతుంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి, ఈ శాఖల అధికారులు ప్రజలను మద్యం మత్తులో ఉంచుతూ వారు మాత్రం రెండు చేతులతో ఎంచక్కా డబ్బులు సంపాదించుకుంటున్నారని వివిధ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో శనివారం నంబర్ 1 కల్లు డిపోను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసి తాళాలు వేశారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు డిపో డైరెక్టర్ వంగ శ్రీనును అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ లోని జిల్లా జైలుకు తరలించారు.