దమ్ముంటే ఓవైసీ సోదరులు కరీంనగర్ లో పోటీ చేయాలి

దమ్ముంటే ఓవైసీ సోదరులు కరీంనగర్ లో పోటీ చేయాలి
BJP Minority Morcha state president Apsar Pasha
  • ఎంఐఎం నేతలవి రజాకర్ల  పోకడలు
  • బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా 

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఎంఐఎం శ్రేణులు రజాకార్ల లాగా వ్యవహరిస్తున్నారని, మైనార్టీల సంక్షేమం కంటే  సొంత ఎజెండా లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టమని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా మండిపడ్డారు. బుధవారం స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దమ్ముంటే ఓవైసీ సోదరులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నాయకులు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మైనార్టీల కోసం ఏనాడు ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ అండదండలతో  చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎంఐఎం నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మైనార్టీ వర్గాల సంక్షేమం కంటే ఎంఐఎం పార్టీ సంక్షేమం కోసమే ఆ పార్టీ నేతలు ఎక్కువగా ఆలోచిస్తారని తెలిపారు. మైనార్టీ ఓట్లతో పబ్బం గడుపుకోవడం రాజకీయ అవసరాలు తీర్చుకోవడం తప్ప ముస్లిం సమాజానికి ఇన్నేళ్లుగా ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కరీంనగర్ ఎంఐఎం నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే విధంగా పలు వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎంఐఎం నేతలు చట్టాలు అతిక్రమించేలా వ్యవహారం చేసిన అధికార కేసీఆర్ సర్కార్ చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మీర్ యాకూబ్ ఆలి,మొహమ్మద్ మజీబ్, బిజెపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ సమీ పర్వేజ్, బల్బీర్ సింగ్,ఈయనత్ అలీ, మొహమ్మద్ సమీ, హఫీజ్, సాబీర్, అహ్మద్, ఫయాజ్, అల్తాఫ్, షహజాద్, సైద్, అయ్యుబ్ తదితరులు పాల్గొన్నారు.