ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!
  • ముగిసిన నామినేషన్ల గడువు
  • ఎమ్మెల్యే కోటా కింద నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్​కుమార్​
  • జనవరి 22న ఏకగ్రీవంపై ప్రకటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెఎంట్​ మహేశ్​ కుమార్ గౌడ్​కు ఈ పదవులు వరించనున్నాయి. బల్మూరి, మహేశ్​కుమార్ గౌడ్​ను అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంతో వారిరువురూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే జనవరి 29న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బలం నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.  

ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో కాంగ్రెస్ బలం 65 గా ఉంది. రెండు స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించడంతో ఆయా స్థానాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల గెలుపు ఖాయమనిపిస్తోంది. అయితే నామినేషన్ల పరిశీలన తర్వాత ఈనెల 22న బల్మూరి, మహేశ్​కుమార్​ గౌడ్​ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎమ్మెల్సీలుగా కొనసాగిన కడియం శ్రీహరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి విజయం సాధించి.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు షెడ్యూల్ విడుదల కాగా, నామినేషన్ల గడువు గురువారం ముగిసింది

మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు తిలకం దిద్దుతున్న ఆయన సోదరి గాజర్ల భారతి