కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిది:  రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిది:  రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 ముద్ర ప్రతినిధి, బీబీనగర్: కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరితూగరంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ  శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. బీబీనగర్ మండలంలోని మహదేవపూర్, కొండమడుగు, గూడూరు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి వెంకటరెడ్డి సోమవారం హాజరయ్యారు. బీబీనగర్ మండలం మహదేవపూర్ గ్రామంలో ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉపసర్పంచి దండెం అనిత ప్రభాకర్ తన సొంత నిధులతో నిర్మించిన బస్సు ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు.

తర్వాత కొండమడుగు గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని, పశు వైద్య ఉపకేంద్ర భవనాన్ని, గూడూరులో పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మహదేవపూర్ గ్రామంలో జరిగిన సభలో మాట్లుడతూ, కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాలిగోటికి కూడా సరిపోనివాడే మిమ్మల్ని (మాజీ సీఎం కేసీఆర్)ను ఫార్మ్ హౌస్ లో పెట్టాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత జడ్పీటీసీగా, తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. నేరుగా యూఎస్ నుంచి వచ్చి ఆయన మంత్రి కాలేదంటూ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. కేటీఆర్ స్థాయి మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుగా ఆయన భాష మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెట్టి, రూ. 1600 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, ఇ:దులో 600 కోట్ల రూపాయలకు అసలు లెక్కలే లేవని పేర్కొన్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపించి, ప్రతి పైసాను వెలికి తీస్తామని తెలిపారు. 

కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి రావినారాయణ రెడ్డి పేరు

 ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని,  మంత్రులు ప్రజల మధ్యనే తిరుగుతున్నారని, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.  మహదేవపూర్ గ్రామంలోని ప్రాచీన  వేణుగోపాలస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని,  దేవాలయం ముందున్న రోడ్డును శివరాత్రి లోగా పూర్తి చేస్తామని తెలిపారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీకృత భవనానికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసి ప్రక్షాళన చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనన్నది ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు.  పోచంపల్లి,  రుద్రవెల్లి బ్రిడ్జి పనులకు సంబంధించి 20 రోజులలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు అభివృద్ధి కార్యక్రమాల కింద  120 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 

ఎయిమ్స్ లో రూ. 1124 కోట్లతో అభివృద్ధి పనులు

దేశంలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి బెస్ట్ ఆస్పత్రిగా నిలిచిపోతుందని, అందుకోసం ఎయిమ్స్ లో 1124 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.  భువనగిరిలో 200 కోట్ల రూపాయలతో 10 ఎకరాల స్థలంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతున్నట్లు తెలిపార. 100 కోట్ల రూపాయలతో భువనగిరి ఖిల్లా రోప్ వే పనుల కోసం డి.పి.ఆర్. సిద్దమైందని,  టెండర్లను పిలవడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొండమడుగు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి దాత చక్రధరరావు 60 లక్షలు ఇవ్వడం పట్ల మంత్రి వారిని అభినందించారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాదేవపూర్ వేణుగోపాల స్వామి ఆలయాన్ని అభివృద్ధిపరిచి పునర్ వైభవం కల్పిస్తామని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యాలరీలు అమలుచేయడం జరిగిందని, మిగతా వాటిని వంద రోజుల లోపల ప్రారంభిస్తామని తెలిపారు.

జూలూరు, పోచంపల్లి,  బొల్లెపల్లి, సంగెం, అనాజిపురం బ్రిడ్జిలు, బీబీనగర్ మక్తఅనంతరం,  పోచంపల్లి, గోకారం రోడ్ల పనులు చేపడతామని తెలిపారు. కొండమడుగులో చండీశ్వర్ నగర్ దేవాదాయ శాఖ స్థలంలో రిజిస్ట్రేషన్లకు అనుమతించే విషయాన్ని, ఇండస్ట్రియల్ జోన్ ను రెసిడెన్షియల్ జోనుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, బీబీనగర్లో పరిశ్రమల పొల్యూషన్ నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కస్తూరిబా స్కూళ్లు, పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి,  జడ్పిటిసి ప్రణీత పింగళి రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, ఆగమయ్య గౌడ్, దండెం ప్రభాకర్, ఇతర  ప్రజా ప్రతినిధులు,  జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.