కాంగ్రెస్ వున్న చోటే అభివృద్ధి

కాంగ్రెస్ వున్న చోటే అభివృద్ధి
  • భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: కాంగ్రెస్ నాయకులు ఎక్కడ వుంటే అక్కడ అభివృద్ధి వుంటుందని, ఎందుకంటే... కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన శాసనసభ్యులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడగలరని, అదే ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే సీఎం తో కలవాలని చూస్తే కనీసం గేట్లు కూడా తెరవని పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీబీనగర్ మండలం గూడూరు, జైనపల్లి, అన్నంపట్ల, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి తదితర గ్రామాలలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గూడూరు పంచాయతీ కార్యాలయం సెంటర్ లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని అన్నారు. సీఎం అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి ప్రజా గాయకుడు దివంగత గద్దర్ కూడా ఎదుర్కొన్నారని, అయిదారు నెలల కిందట ఆయన ముఖ్యమంత్రిని కలవాలని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురుచూసినా కూడా వీలుపడలేదని తెలిపారు. ఒక దళిత నేతను కలిసేందుకు కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి హయాంలో ప్రజాస్వామ్యం ఎక్కడవుందని ఆయన ప్రశ్నించారు. మన సంక్షేమం, మన అభివృద్ధి, మన ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణను పోరాడి సాధించుకున్నామని, ఇప్పటి పాలకులు అవేమీ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు లేవని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 23 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని, అడిగిన వారందరికి నాడు ఇచ్చారని అన్నారు. ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ కూడా అప్పట్లో చక్కగా అమలయ్యాయని తెలిపారు. ఈ ప్రభుత్వం హయంలో ఉద్యోగాలు లేవు... ఆరోగ్యశ్రీ లేదు... ఇతర అభివృద్ధి కూడా లేకుండా పోయిందని అన్నారు. 

ఎన్నో సమస్యలు ఈ ప్రాంతంలో వున్నా కూడా ఎన్నడూ అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తావించలేదని అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎయిమ్స్ లో ఉద్యోగ నియామకాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని, మూసీ నది కాలుష్యం వెదజల్లకుండా ప్రక్షాళన జరగాల్సి వుందని యఅన్నారు. ఇవన్నీ కావాలంటే... తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని బలపరిచి, చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. అంతకుముందు మాజీమంత్రి మోత్కుపల్లి నరిసింహులు మాట్లాడుతూ, ఈ ప్రాంత తెలుగుదేశం అభిమానులంతా కూడా కాంగ్రెస్ ను బలపరిచి ఓటేసి అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచి బాలిరెడ్డి, జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, మహదేవపూర్ కాంగ్రెస్ నేత దండెం ప్రభాకర్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారందర్నీ అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.