జనగామలో ఉద్రిక్తత

జనగామలో ఉద్రిక్తత
  • వినాయక మండపం వద్ద  మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
  • పోలీసులకు ఫిర్యాదు.... నలుగురిపై కేసు నమోదు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో ఓ వినాయక మండపం వద్ద  ఒక వర్గానికి చెందిన యువకుల వీరంగం సృష్టించారు. మంటపం వద్ద పూజలు చేయడానికి వచ్చిన యువతుల పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారు డయల్‌100 కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో వెనువెంటనే పోలీసులు  రంగ ప్రవేశం చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ చేసిన అనంతరం వారిని పోలీసులు విడిచి పెట్టారు. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ కు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులకు, వారి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. వారిని ఎలా వదిలి పెడతారని నిలదీశారు. 

 ఈ విషయం తెలుసుకున్న  మరో వర్గానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసు స్టేషన్  వద్ద ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో  పోలీసులు వెంటనే రంగం ప్రవేశం చేశారు. ఆందోళనకు చేస్తున్న ఇరువర్గాలను అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు.  సంయమనం పాటించాలని వారిని పోలీసులు కోరారు. అనవరంగా రాద్దాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరువర్గాలు శాంతించాయి. కాగా వినాయక మండపం వద్ద యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు భగంగం కలిగించేలా ప్రవర్తించినా, మత ఘర్షణలకు దిగినా సహించబోమన్నారు.  ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.